సింగరేణి ప్రయోజనాలే ప్రభుత్వానికి ప్రాధాన్యం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. భద్రాద్రి కొత్తగూడెం, జూలై 24 (ఆధాబ్ న్యూస్):
కొత్త బొగ్గు బ్లాకుల సాధనకు సమగ్ర కార్యాచరణతో ముందుకెళ్లాలని అధికారులకు సూచన
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, మణుగూరు ప్రకాశ్ ఖని (పీకే ఓసీ) ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనిని సందర్శించి విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు తవ్వకాలు, భద్రతా ప్రమాణాలు, సంస్థ భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని వివిధ విభాగాలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ, బొగ్గు వినియోగం, యంత్రాల నిర్వహణ, సెంట్రల్ కంట్రోల్ యూనిట్ పనితీరును పరిశీలించారు. ప్లాంట్ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని అధికారులకు సూచించారు.
అనంతరం భద్రాద్రి పవర్ ప్లాంట్ టౌన్‌షిప్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన డి.ఏ.వి. పాఠశాలను ప్రారంభించారు. పాఠశాలలోని తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం తదితర మౌలిక వసతులను పరిశీలించి ఉద్యోగుల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు చేపట్టిన చర్యలను అభినందించారు.
తదుపరి మణుగూరు ప్రకాశ్ ఖని ఓపెన్‌కాస్ట్ గనిని సందర్శించిన భట్టి విక్రమార్క బొగ్గు ఉత్పత్తి, నాణ్యత, యంత్రాల పనితీరు, భద్రతా ప్రమాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గనిలోని బొగ్గును స్వయంగా పరిశీలించిన ఆయన, రాష్ట్ర విద్యుత్ రంగానికి సింగరేణి వెన్నెముకలాంటి సంస్థ అని పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని బొగ్గు నిల్వల పెంపు, ఉత్పత్తి విస్తరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
రాబోయే రోజుల్లో కొత్త బొగ్గు గనుల వేలంలో సింగరేణి చురుగ్గా పాల్గొని కొత్త బొగ్గు బ్లాకులను సాధించేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. పోటీ ప్రపంచంలో సింగరేణి దేశంలోనే అగ్రగామి బొగ్గు సంస్థగా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా అధికారులు తాడిచెర్ల బొగ్గు బ్లాక్ సింగరేణికి కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ, పీకే ఓసీ డిప్ సైడ్ బ్లాక్‌ను కూడా సింగరేణికే కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, “సింగరేణి ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. సంస్థ అభివృద్ధి, కొత్త బొగ్గు బ్లాకుల సాధన, ఉద్యోగుల సంక్షేమం, ఉత్పత్తి సామర్థ్యాల పెంపు వంటి అన్ని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది” అని స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, జిల్లా కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, మాలోత్ రాందాస్ నాయక్, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, టీఎస్‌జెన్‌కో సీఎండీ హరీష్, సింగరేణి డైరెక్టర్ గౌతమ్ పొట్రూ, సింగరేణి, టీఎస్‌జెన్‌కో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.









