ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్‌లో విస్తృత వాహన తనిఖీలు. పినపాక,ఆధాబ్ న్యూస్:
ప్రజల భద్రత, ట్రాఫిక్ నియమాల అమలు, నేరాల నియంత్రణ లక్ష్యంగా ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్‌లో గురువారం పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. సీఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక తనిఖీల్లో ద్విచక్ర వాహనాలు, స్కూల్ బస్సులు, ఇతర రవాణా వాహనాలను ఆపి వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, బీమా, హెల్మెట్ వినియోగం తదితర భద్రతా నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించారు.
తనిఖీల సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పిస్తూ, హెల్మెట్ ధరించడం, చెల్లుబాటు అయ్యే పత్రాలతోనే వాహనాలు నడపడం, రహదారి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలను గుర్తించి నేరాలను అరికట్టే ఉద్దేశంతో ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.









