రోడ్లపై కేజ్ వీల్స్ ట్రాక్టర్లు నడిపితే కఠిన చర్యలు
ట్రాక్టర్ల సీజ్, కేసుల నమోదు తప్పదు: ఏన్కూర్ ఎస్సై సంధ్య
ఖమ్మం, జూలై 22 (ఆధాబ్ న్యూస్):
రోడ్లపై కేజ్ వీల్స్ (Cage Wheels) అమర్చిన ట్రాక్టర్లను నడపడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏన్కూర్ ఎస్సై సంధ్య హెచ్చరించారు.
ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు రోడ్లపై కేజ్ వీల్స్‌తో సంచరించే ట్రాక్టర్లను గుర్తించి సీజ్ చేయడంతో పాటు సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.
ఏన్కూర్ మండలం టి.ఎల్.పేట గ్రామ ప్రధాన రహదారిపై కేజ్ వీల్స్ అమర్చిన ట్రాక్టర్ నడపడం వల్ల రహదారి తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి టి.ఎల్.పేట గ్రామానికి చెందిన కూచిపూడి నరసింహారావుపై ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినందుకు కేసు నమోదు చేసి ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు వెల్లడించారు.
ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి గ్రామాల వరకు నాణ్యమైన రహదారులను నిర్మిస్తోందని, వాటిని పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఎస్సై పేర్కొన్నారు. వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్లకు కేజ్ వీల్స్ అమర్చడం సాధారణమే అయినప్పటికీ, పొలాల్లో పనులు పూర్తయ్యాక వాటిని తొలగించి సాధారణ టైర్లు అమర్చాలని సూచించారు. రోడ్లకు నష్టం జరగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని ట్రాక్టర్ యజమానులకు సూచించారు.
ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, ఎవరైనా ఉల్లంఘిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్సై సంధ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు.









