కరకగూడెంలో ఎయిర్‌టెల్ సిగ్నల్ సమస్యతో వినియోగదారుల అవస్థలు
ఆధాబ్ న్యూస్, కరకగూడెం, జూలై 11:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో గత నాలుగు నుంచి ఐదు రోజులుగా ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ సిగ్నల్స్ సరిగా అందక సెల్‌ఫోన్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిగ్నల్ సమస్య కారణంగా ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ సేవలు అంతరాయానికి గురవుతున్నాయి.
సిగ్నల్స్ లేకపోవడంతో తమ మొబైల్ ఫోన్లలోనే సమస్య ఏర్పడిందని భావించిన పలువురు వినియోగదారులు రిపేర్ సెంటర్లకు వెళ్లగా, అసలు సమస్య నెట్‌వర్క్‌లోనే ఉందని తెలిసి నిరాశ చెందుతున్నారు.
అత్యవసర సమయాల్లో బంధువులు, మిత్రులు, అధికారులకు సమాచారం అందించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సిగ్నల్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి ఫోన్ మాట్లాడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ఎయిర్‌టెల్ సంస్థ ప్రతినిధులు స్పందించి నెట్‌వర్క్ సమస్యను వెంటనే పరిష్కరించి కరకగూడెం మండల ప్రజలకు అంతరాయం లేకుండా మొబైల్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.









