అర్హులైన వితంతు, ఒంటరి మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరించాలి
– సామాజిక భద్రత జిల్లా ప్రాజెక్టు మేనేజర్ నర్మదారెడ్డి
కరకగూడెం, ఆగస్టు 29 (ఆధాబ్ న్యూస్): ఆసరా పెన్షన్లలో భాగంగా నూతనంగా వితంతు, ఒంటరి మహిళలకు పెన్షన్లు అందించేందుకు అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సామాజిక భద్రత జిల్లా ప్రాజెక్టు మేనేజర్ నర్మదారెడ్డి ఆదేశించారు. ప్రతి గ్రామపంచాయతీలో అర్హులైన మహిళలను గుర్తించి వారి నుంచి దరఖాస్తులు తీసుకుని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు.
ఈ మేరకు శనివారం కరకగూడెం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్‌తో నర్మదారెడ్డి సమావేశమై పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు ప్రక్రియపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామపంచాయతీలో ఉన్న వితంతు, ఒంటరి మహిళల నుంచి ఇప్పటివరకు 200కు పైగా దరఖాస్తులను స్వీకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు తెలిపారు. దరఖాస్తుల నమోదు ప్రక్రియ దాదాపు పూర్తయిందని పేర్కొన్నారు.
అర్హత కలిగిన ఏ ఒక్కరూ దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోకుండా గ్రామస్థాయిలో అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని నర్మదారెడ్డి సూచించారు. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో సామాజిక భద్రత జిల్లా ప్రాజెక్టు మేనేజర్ నర్మదారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీఎం వినోద్‌క్రాంతి పాల్గొన్నారు.









