ఆపదలో ఆపన్నహస్తం – కొత్తగూడ ఎస్సై రాజ్ కుమార్ మానవత్వం మరోసారి వెలుగులోకి
కరకగూడెం, ఆధాబ్ న్యూస్;
ఏ సమయంలో ఆపద వచ్చినా “నేనున్నాను” అని ముందుకు వచ్చి నిలబడే సేవాభావం గల పోలీస్ అధికారి అంటే ఆయన ఎవరో కాదు – మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్ఐ రాజ్ కుమార్. సమస్య ఎక్కడ ఉన్నా, ఎవరికైనా కష్టం వచ్చినా ఆయన మనసు వెంటనే స్పందించడం ఆయన ప్రత్యేకత.
తాడ్వాయి ప్రాంతంలో జరిగిన ఆటో ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారి చికిత్స కోసం కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ రాజ్ కుమార్ స్పందించి, తన వంతుగా ₹3,000 ఆర్థిక సహాయం అందించారు. ఫోన్‌పే ద్వారా పంపిన ఈ సహాయం ఆ కుటుంబానికి కష్టకాలంలో ఒక ఆశాకిరణంగా మారింది.
గతంలో కూడా ఇటువంటి ఆర్థిక సహాయాలు ఎన్నో అందించిన ఆయన, ఆపద వచ్చినప్పుడు అర క్షణం కూడా ఆలస్యం చేయని మనసుతో ప్రజల అండగా నిలుస్తున్నారు. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం ఆయనకు కేవలం బాధ్యత మాత్రమే కాదు, మానవత్వానికి నిదర్శనం.
“ప్రాణాలతో పోరాడుతున్న చిన్నారిని కాపాడటం మనందరి బాధ్యత. చిన్న సహాయం అయినా ఒక ప్రాణాన్ని నిలబెట్టగలదు” అని ఆయన తెలిపిన మాటలు అందరిని కదిలించాయి.
ఇప్పటికే భర్తను కోల్పోయి, ఇద్దరు పిల్లలతో ఒంటరిగా జీవనం సాగిస్తున్న రజితకు ఈ సహాయం కొంత ఊరట కలిగించింది. స్థానిక ప్రజలు ఎస్ఐ రాజ్ కుమార్ చేసిన సేవను ప్రశంసిస్తూ, మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు.
సమాజంలో ఇంకా మానవత్వం జీవించి ఉందని, పోలీస్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పెంచేలా చేసిన ఈ ఘటన అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
ఒక్కో చేయి కలిస్తే… ఒక ప్రాణం నిలుస్తుంది… మన సహాయం ఒక కుటుంబానికి కొత్త జీవం.









