ప్రతి క్షణం
ప్రజల పక్షం

  తెలంగాణలో పోలీస్ ప్రమోషన్స్ కు గ్రీన్ సిగ్నల్ – సిఐలు, ఆర్‌ఎస్‌ఐలకు పదోన్నతుల తీపి కబురు

తెలంగాణలో పోలీస్ ప్రమోషన్స్ కు గ్రీన్ సిగ్నల్ – సిఐలు, ఆర్‌ఎస్‌ఐలకు పదోన్నతుల తీపి కబురు

హైదరాబాద్,ఆధాబ్,న్యూస్: తెలంగాణలోని పోలీసు శాఖకు సంబంధించిన పదోన్నతుల వ్యవహారంలో ఎట్టకేలకు కీలక పరిణామం చోటు చేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్లకు (సీఐ) డీఎస్పీ హోదాలోకి పదోన్నతులు కల్పించే ఫైల్‌కు ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారు. ఆయన సంతకం చేసిన ఫైల్ ప్రస్తుతం హోం శాఖకు చేరింది. డిపార్ట్‌మెంట్ పలు న్యాయపరమైన అంశాలను సమీక్షించి, తుది ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది.

అంతేకాకుండా, రెసర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లకు (ఆర్‌ఎస్‌ఐ) సైతం డీఎస్పీలుగా పదోన్నతుల విషయంలో సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, ఆయా ఫైళ్లపై సంతకం చేయడం ద్వారా వడిగా పురోగమిస్తున్న చర్యలకు బలం చేకూరింది. దాంతో పలువురు పోలీసు అధికారుల దీర్ఘకాలిక ఎదురు చూపులకు విరామం లభించనుంది.

వయసులో వెనుకబడిన జూనియర్లు ముందుకు

1996, 1998, 2002 బ్యాచ్‌లకు చెందిన సీఐలు డీఎస్పీ పదవుల్లోకి రానున్న అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే మల్టీ జోన్ వన్ పరిధిలో ఉన్న వారికంటే ఇతర జోన్‌లలోని జూనియర్లకు ముందే పదోన్నతులు లభించడంతో కొంతమంది సీనియర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

పదోన్నతుల ప్రక్రియ పూర్తవడానికి మరో నెల రోజుల సమయం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మల్టీజోన్ వన్‌లోని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సీఐలలో పది మందికి పదోన్నతులు వచ్చే అవకాశముంది. ఈ సందర్భంలో రిజర్వేషన్లు కూడా పరిగణనలోకి తీసుకోవడం వల్ల కొంతమందికి ప్రమోషన్‌లు ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది.

ఆర్‌ఎస్‌ఐల న్యాయపోరాటానికి ఫలితం

ఎంతోకాలంగా ఆర్‌ఎస్‌ఐలుగా కొనసాగుతూ, సివిల్ పోలీసులుగా గుర్తింపు కోరుతూ న్యాయపోరాటం చేసిన అధికారులకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయంతో న్యాయం చేసినట్టైంది. సివిల్ పోలీసులుగా కన్వర్షన్‌కి సీఎం సంతకం చేయడంతో వారికి డీఎస్పీ హోదాకు అర్హత ఏర్పడింది.

కానీ సీనియార్టీ లిస్టుల తయారీ సమయంలో కొందరికి మూడు లేదా నాలుగు నెలల తేడాతో ప్రమోషన్ అవకాశాలు దక్కకపోవడం వారి కుటుంబాలను ఆందోళనకు గురి చేసింది. వారు కూడా ఆ కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

పదోన్నతుల జాబితాలో ఉన్న అధికారులు

పదోన్నతులు పొందే అధికారుల జాబితాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పని చేస్తున్న నరేందర్, శ్రీధర్ రావు, పుల్యాల కిషన్, సీతా రెడ్డి, కొమ్మురి శ్రీనివాసరావు, మహేందర్ రెడ్డి, సార్ల రాజు, ఆర్షం సువర్ణ తదితరుల పేర్లు ఉన్నట్టు సమాచారం.

ఈ నిర్ణయంతో తెలంగాణ పోలీస్ శాఖలో మరోసారి ప్రమోషన్‌ కలకలం కనిపించనుండగా, సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న అధికారులకు ఇది నిజమైన విజయంగా నిలిచింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!