మేడే స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దుకై పోరాడుదాం – టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి.
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్ :మే డే సందర్భంగా టీయూసీఐ జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి కార్మిక వర్గానికి ఓ కీలక పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని, ప్రతి కార్మికుడికి లివింగ్ వేతనం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
స్థానిక టీయూసీఐ కార్యాలయం వద్ద వి. జానయ్య అధ్యక్షతన జెండా ఆవిష్కరణ జరిగితే, మున్సిపల్ కార్యాలయం దగ్గర భరత్, ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర మణెమ్మ, ఓసీ-2 వద్ద జె. అశోక్, పైలట్ కాలనీ దగ్గర వి. జానయ్య, బీటీపీఎస్ దగ్గర కె. రామకృష్ణ, సాంబాయిగూడెం ప్రాంతంలో ఆర్. ప్రభాకర్ తదితరులు జెండా ఆవిష్కరించి కార్మికుల హక్కుల కోసం పోరాడాల్సిన అవసరాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, “మేడే చరిత్ర 139 ఏళ్ల క్రితం అమెరికాలోని చికాగో నగరంలో మొదలైంది. 8 గంటల పని దినం కోసం కార్మికులు చేసిన ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రభుత్వం కాల్పులు జరిపి 8 మంది కార్మికులను పొట్టన పెట్టుకుంది. వారి త్యాగంతో ప్రపంచ వ్యాప్తంగా కార్మిక హక్కులు సాధ్యమయ్యాయి,” అన్నారు.
అయితే నేటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం నాలుగు కార్మిక వ్యతిరేక కోడ్స్ తీసుకురావడం ద్వారా, కార్మికుల హక్కులను కాలరాయడానికి ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 8 గంటల పని దినం, సంఘం ఏర్పాటు, సమ్మె చేయడం వంటి ప్రాథమిక హక్కులను తీసివేయడమే లక్ష్యంగా ఈ కోడ్స్ రూపొందించారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో బత్తుల వెంకటేశ్వర్లు, ఎం. రాజేందర్, పి. సంజీవరెడ్డి, లక్ష్మణ్, అయోధ్య, ఇస్రాయెల్, కేదారి, ప్రభాకర్ రెడ్డి, కుర్బుద్దీన్, సీతారాములు, విజయ్, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.









