కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
రైస్ మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులకు ప్రభుత్వ హెచ్చరిక
హైదరాబాద్, అక్టోబర్ 29 (ఆధాబ్ న్యూస్): రాష్ట్రంలో బియ్యం ధరలు అమాంతం పెరగకుండా, సామాన్యులకు అందుబాటులో ఉండేలా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర (IPS) ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని సివిల్ సప్లై భవన్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ నేతృత్వంలో మిర్యాలగూడ, నిజామాబాద్, నల్గొండ ప్రాంతాలకు చెందిన ప్రముఖ రైస్ మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులతో సమావేశం జరిగింది. మార్కెట్లో బియ్యం కొరత లేకుండా చూడాలని, వినియోగదారులకు అందే ధరలను అదుపులో ఉంచాలని అధికారులు స్పష్టం చేశారు.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బియ్యం నిల్వలు గత సీజన్‌కు చెందినవేనని, వాటిని సాకుగా చూపి ధరలను పెంచేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని అధికారులు హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టించడం, బియ్యాన్ని అక్రమంగా గోదాముల్లో నిల్వ చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు.
వ్యాపారుల లాభాపేక్ష కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు తెలిపారు. ధరలను నియంత్రణలో ఉంచడంతో పాటు ప్రభుత్వానికి మిల్లర్లు, వ్యాపారులు పూర్తిస్థాయిలో సహకరించాలని సూచించారు.
మార్కెట్ పరిస్థితులను బట్టి ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి బియ్యం విక్రయించే అవకాశం ఉందని, అటువంటి సందర్భాల్లో కౌంటర్లకు అవసరమైన బియ్యాన్ని ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా చేయాలని అధికారులు స్పష్టం చేశారు.
మార్కెట్లో బియ్యం ధరలు, నిల్వల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. సామాన్యులకు అందుబాటు ధరల్లో బియ్యం లభించేలా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
— ఆధాబ్ న్యూస్








