కరకగూడెం మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నిరసన
ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్.. అనంతారంలో ‘కాంగ్రెస్ బాకీ కార్డు’తో నినాదాలు
కరకగూడెం, సెప్టెంబర్ 3 (ఆధాబ్ న్యూస్): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు కరకగూడెం మండలంలోని అనంతారం గ్రామంలో నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షుడు రావుల సోమయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున 33 నెలలకు రూ.82,500, వృద్ధులు, బీడీ కార్మికులకు నెలకు రూ.4,000 చొప్పున పెన్షన్ బకాయిలు, దివ్యాంగులకు నెలకు రూ.6,000 పెన్షన్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద తులం బంగారం వంటి హామీలు బాకీ ఉన్నాయని ఆరోపించారు.
అలాగే విద్యార్థులకు స్కూటీలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపు, విద్యా భరోసా కార్డు కింద రూ.5 లక్షలు, రైతు భరోసా, దళితబంధు, పంటలకు రూ.500 బోనస్ వంటి హామీలను కూడా ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.
రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12 వేల చొప్పున భృతి, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ.12 వేల భృతి వంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించకుండా వెంటనే అమలు చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.









