రఘునాథపాలెంలో ఘనంగా పొట్టగండుగ–పచ్చ పండుగ
కరకగూడెం, ఆగస్టు 30 (ఆధాబ్ న్యూస్): రఘునాథపాలెం గ్రామంలో పూర్వీకుల నుంచి కొనసాగుతున్న సంప్రదాయ ఆచారం **పొట్టగండుగ–పచ్చ పండుగ (కొత్తలు)**ను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పోలేబోయిన, పులి వంశస్థుల సంప్రదాయ ఆచారంగా ఈ పండుగను నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
కొత్త వరి, సామా, దుస్సా కంకులు తదితర పంటలు పచ్చగా పొట్ట దశలో ఉన్న సమయంలో ప్రకృతి, భూమి, వేల్పుతో అనుసంధానం చేస్తూ కృతజ్ఞతగా ఈ ఆచారాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ప్రాంతాన్ని బట్టి ఈ పండుగను పొట్టగండుగ, పచ్చ పండుగ, కొత్తలు, వేల్పుకు వెన్నుకట్టు వంటి పేర్లతో పిలుస్తారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పోలేబోయిన, పులి వంశస్థులు సంప్రదాయ పద్ధతుల్లో పాల్గొని పూర్వీకుల ఆచారాలను కొనసాగించారు. గ్రామ పెద్దలు, పూజారులు, తలపతులు, వడ్డేలు, మహిళలు, యువత, చిన్నారులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వంశపారంపర్యంగా వస్తున్న ఇటువంటి ఆచారాలు కేవలం పండుగలకే పరిమితం కాకుండా ఆదివాసీ సమాజ చరిత్ర, వంశ గుర్తింపు, వ్యవసాయ జ్ఞానం, ప్రకృతి ఆరాధన, సామూహిక జీవన విధానానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు.
ప్రస్తుత తరానికి ఈ సంప్రదాయాల ప్రాధాన్యతను తెలియజేయడంతో పాటు, పెద్దల వద్ద ఉన్న వంశ చరిత్ర, వేల్పు సంప్రదాయాలు, పూజా విధానాలు, పంటలకు సంబంధించిన జ్ఞానం, మౌఖిక చరిత్రను భద్రపరచి భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
“పూర్వీకులు అందించిన ఆచారం మన వారసత్వం. దానిని కాపాడి భవిష్యత్ తరాలకు అందించడం మన బాధ్యత” అని వారు అన్నారు. వంశం–వేల్పు–పంట–ప్రకృతి మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ పండుగ మరోసారి చాటిచెప్పిందని తెలిపారు.









