ప్రతి క్షణం
ప్రజల పక్షం

  భద్రాచలం ఏరియా ఆస్పత్రి సమస్యలు వెంటనే పరిష్కరించాలి: సీపీఎం

 

భద్రాచలం ఏరియా ఆస్పత్రి సమస్యలు వెంటనే పరిష్కరించాలి: సీపీఎం

భద్రాచలం, మే 29 (ఆధాబ్ న్యూస్): భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి, అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బి. నర్సారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆస్పత్రిలో నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వే అనంతరం ఆయన మాట్లాడారు.

ఆస్పత్రిలో 42 మంది వైద్యులు అవసరం ఉండగా ప్రస్తుతం కేవలం 20 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని, దీంతో రోజుకు సుమారు 400 మంది ఓపీ రోగులకు సరైన వైద్య సేవలు అందించడం కష్టసాధ్యంగా మారిందన్నారు. వైద్య సిబ్బంది కొరత కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం పేద ప్రజల వైద్యం పట్ల నిర్లక్ష్యం వీడి ఆస్పత్రి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. శానిటేషన్ కార్మికులకు నెలనెలా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సీపీఎం భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి మాట్లాడుతూ, 200 పడకల భద్రాచలం ఏరియా ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని, అడ్వాన్స్డ్ ట్రామా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు సేవలందిస్తున్న ఈ ఆస్పత్రికి న్యూరో సర్జన్ వంటి ప్రత్యేక వైద్య నిపుణులను నియమించాలని కోరారు.

పని ఒత్తిడి, సిబ్బంది కొరత కారణంగా వైద్య సేవలు ప్రభావితమవుతున్నాయని, పాలకుల నిర్లక్ష్యమే ఆస్పత్రి దుస్థితికి కారణమని విమర్శించారు. ఆస్పత్రి సమస్యలపై నిర్వహించిన సర్వే నివేదికను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు అనసూయ, పారిల్లి సంతోష్ కుమార్, డి.సీతాలక్ష్మి, నాదెండ్ల లీలావతి, ధనకొండ రాఘవయ్య, కనకశ్రీ, డి.రామకృష్ణ, పిల్ల ఎంకన్న, ఎస్ఎఫ్ఐ నాయకుడు రవీంద్ర, డీవైఎఫ్ఐ నాయకులు ఆది, పోసి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్