చలో కొత్తగూడ తుడుందెబ్బ బహిరంగ సభను విజయవంతం చేయాలి
- తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డా. మైపతి అరుణ్ కుమార్ పిలుపు
కరకగూడెం, ఆధాబ్ న్యూస్, మే 13:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో బుధవారం తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలెబోయిన వెంకటనారాయణ, తుడుందెబ్బ భద్రాద్రి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కలం వేణుగోపాల్ అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డా. మైపతి అరుణ్ కుమార్ హాజరై మాట్లాడారు.
జూన్ 3, 2026న మహబూబాబాద్ జిల్లా పాకాల కొత్తగూడ మండల కేంద్రంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో “లంబాడీలు ఎస్టీలు కారు” అనే అంశంపై భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభను విజయవంతం చేయడానికి ఆదివాసీ యువత, మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
1976 నుంచి ఆదివాసీల రిజర్వేషన్లను లంబాడీలు అక్రమంగా వినియోగించుకుంటూ ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఏజెన్సీ సర్టిఫికెట్లు లేకపోవడం, ఏజెన్సీ ఉద్యోగాలు రాకపోవడం, ఐటిడిఏ ద్వారా జరగాల్సిన నియామకాలు నిలిచిపోవడం వల్ల ఆదివాసీ నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
జీవో 317తో వచ్చిన నూతన జోనల్ విధానం కారణంగా షెడ్యూల్-5, ఏజెన్సీ జీవోలను పక్కనపెట్టి జనరల్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడం వల్ల ఆదివాసీలకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయని విమర్శించారు. అలాగే పోడు భూముల సమస్యలు, అటవీ శాఖ ఇబ్బందులపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి సుతారి నాగేశ్వరావు, మండల ప్రధాన కార్యదర్శి కలం సంపత్ కుమార్, జేఏసీ ప్రధాన కార్యదర్శి సాంబమూర్తి, సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు చందా రామకృష్ణ, ASU జిల్లా ఉపాధ్యక్షులు ఇర్ప నాగకృష్ణ, ASU జిల్లా అధికార ప్రతినిధి & కోశాధికారి పోలెబోయిన స్వామిప్రసాద్, పోలెబోయిన రాజు, పోలెబోయిన వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.









