మానవత్వాన్ని చాటుకున్న గోపాలరావుపేట గ్రామస్తులు – మృతురాలి దహన సంస్కారాలకు 13,300 రూపాయల ఆర్థిక సహాయం
పినపాక,ఆధాబ్ న్యూస్: మానవత్వం మరెక్కడో కాదు… మన గ్రామాల్లోనూ బతికే ఉందని చాటి చూపించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని గోపాలరావుపేట గ్రామస్తులు. అనారోగ్యంతో మృతి చెందిన పిట్టల లక్ష్మి దహన సంస్కారాల కోసం గ్రామ యువత, పెద్దలు కలిసి 13,300 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.
పిట్టల లక్ష్మి గతంలో పినపాక మండల కార్యాలయంలో మజ్కూర్గా, అలాగే తోగ్గూడెం పంచాయతీలో సేవలు అందించారు. జీవితం తలవంచేలా మారడంతో, ఒకేసారి కుటుంబ పెద్దలంతా సంవత్సర కాలంలోనే మరణించడంతో అనాథగా మిగిలారు. ఈ దుస్థితిని తట్టుకోలేకపోయిన ఆమె ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ, శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో తుది శ్వాస విడిచారు.
ఎవరూ లేని లక్ష్మి మృతదేహాన్ని దహనం చేయడానికి సహాయం కావాలంటూ గ్రామానికి సంబంధించిన సామాజిక మాధ్యమాల్లో ఓ సందేశం వైరల్ కాగా, “మేమున్నాం” అంటూ స్పందించిన గ్రామ యువత, పెద్దలు మానవతావంతంగా ముందుకు వచ్చారు. ఊడుగుల ఐలయ్య చేతుల మీదుగా 13,300 రూపాయలు ఆమె కుటుంబ సభ్యులకు అందించారు.
ఈ దహనసంస్కార కార్యక్రమంలో కూనారపు సత్యనారాయణ, సూర నరసింహారావు, ఊడుగుల రామచంద్రు, డాక్టర్ సత్యం, కొంపెల్లి సంతోష్, గాడుదుల దిలీప్ కుమార్, రేసు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ ఘటన గ్రామ సమాజంలో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించిన ఉదాహరణగా నిలిచింది.









