తెలుగుదేశం పార్టీకి సారపాక ఐటీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఘన విజయం
సారపాక, ఆధాబ్ న్యూస్:
సారపాక ఐటీసీ పేపర్ బోర్డు గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్మిక విభాగం అనుబంధ సంఘం టీఎన్టీయూసీ మరోసారి ఘన విజయాన్ని సాధించింది. వరుసగా రెండవసారి విజయం సాధించిన ఈ సందర్భంలో టీఎన్టీయూసీ సారపాక యూనియన్ అధ్యక్షుడు కనకమెడల హరిప్రసాద్‌ను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు.
ఈ విజయాన్ని పురస్కరించుకొని హిందూపురం శాసనసభ సభ్యులు నందమూరి బాలకృష్ణ కూడా సారపాక టీఎన్టీయూసీ బృందానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు బక్కిని నరసింహులు, పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్, రాష్ట్ర స్థాయి టీఎన్టీయూసీ నాయకులు పోటు రంగారావు, పినపాక నియోజకవర్గ నాయకులు వట్టం నారాయణ దొర, వాసిరెడ్డి చలపతి రావు, నియోజకవర్గంలోని ఏడు మండలాల అధ్యక్షులు, ఐటీసీ కార్మిక విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన యూనియన్ నాయకత్వాన్ని పొగిడుతూ, కార్మిక హక్కుల పరిరక్షణకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని నాయకులు తెలిపారు.









