ఆటో డ్రైవర్ బాలు కుటుంబానికి ఆర్థిక సహాయం
మానవత్వం చాటుకున్న కరకగూడెం ఎస్సై నాగేశ్వరరావు
కరకగూడెం, ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మలకుర్తి బాలకృష్ణ (బాలు) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో బాలు దశదిన కర్మల ఖర్చుల నిమిత్తం కరకగూడెం ఆటో యూనియన్ సభ్యులు, స్థానిక ఎస్సై నాగేశ్వరరావు ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
కరకగూడెం ఆటో యూనియన్ సభ్యులు బాలు కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే ఎస్సై నాగేశ్వరరావు తన వంతుగా రూ.5 వేల నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం బాలు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కష్టసమయంలో తమకు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన ఆటో యూనియన్ సభ్యులు, ఎస్సై నాగేశ్వరరావుకు బాలు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు కొమరం సాంబశివరావు, గుడ్ల రంజిత్ కుమార్, నిట్టా సౌందర్యరావు, బెజవాడ రాములు, బాదె సాగర్, కొలగాని రవి, యజ్జు సాయి, తోలెం రవి, బంధు సతీష్, నిట్టా సాయి, తోట శివ, నిట్టా సంతోష్ తదితరులు పాల్గొన్నారు.









