వెళ్లి రావమ్మా.. బతుకమ్మ..
ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు
కరకగూడెం, అక్టోబర్ 19 (ఆధాబ్ న్యూస్): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ముగింపు వేడుకలు కరకగూడెం మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజులుగా ఎంతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ, ఆటలాడుతూ సంబరాలు జరుపుకున్న మహిళలు చివరి రోజు బతుకమ్మలకు ఘనంగా వీడ్కోలు పలికారు.
మండలంలోని తాటిగూడెం, చిరుమళ్ల, చోప్పాల, బట్టపల్లి తదితర గ్రామాల్లో తొమ్మిది రోజుల క్రితం గ్రామాలు, వీధులు, వాడవాడలా బతుకమ్మలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి పూజలు నిర్వహించారు. చివరి రోజు సోమవారం ఉదయం నుంచే మహిళలు వివిధ రకాల పూలు, ఆకులతో రంగురంగుల బతుకమ్మలను అందంగా పేర్చారు. బతుకమ్మ మండపాల వద్ద విద్యుత్ దీపాలు, డెక్కులతో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం మరింత శోభాయమానంగా మారింది.
సాయంత్రం మహిళలు సంప్రదాయ దుస్తుల్లో అందంగా ముస్తాబై, బతుకమ్మలను తలపై ఎత్తుకుని మండపాల వద్దకు చేరుకున్నారు. బతుకమ్మలను చుట్టూ తిరుగుతూ సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ, ఆటలాడుతూ సందడి చేశారు. చిన్నారులు, యువతులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొనడంతో గ్రామాల్లో పండుగ సందడి నెలకొంది. అనంతరం పిండి వంటలు, ప్రసాదాలు సమర్పించి, బతుకమ్మలను స్థానికంగా ఉన్న చెరువులు, వాగులు, వంకలు, నదుల వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.
బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేసే సమయంలో “వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. మళ్లీ ఏడాదికి రావమ్మా” అంటూ మహిళలు భావోద్వేగంతో వీడ్కోలు పలికారు. తొమ్మిది రోజుల పాటు తమ కుటుంబాల్లో, గ్రామాల్లో ఆనందాన్ని నింపిన బతుకమ్మకు సంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలుకుతూ వేడుకలను ఘనంగా ముగించారు.
ఈ కార్యక్రమంలో మానస, ధనలక్ష్మి, నిరిషా, సాయి సహస్ర, సింధు తేజశ్రీ, రాధ, దీపిక, సాంబలక్ష్మి, స్వాతి, జ్యోతి, సరిత, మౌనిక, సంధ్యారాణి, శాంతి, క్రాంతి, రమ్య, రత్న, పద్మ, అశ్విని, రమాదేవి, సమ్మక్క, మల్లమ్మతో పాటు పలువురు మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
— ఆధాబ్ న్యూస్








