కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో
కరకగూడెం, అక్టోబర్ 15 (ఆధాబ్ న్యూస్): కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.
ముందుగా సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించిన కలెక్టర్.. మెడికల్ ఆఫీసర్ రవితేజ అందుబాటులో లేకపోవడంపై సిబ్బందిని ఆరా తీశారు. అయితే సిబ్బంది పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ గైర్హాజరుపై సరైన సమాచారం ఇవ్వకుండా తప్పుడు సమాధానాలు ఇచ్చిన ఇద్దరు అవుట్‌సోర్సింగ్ జీఎన్‌ఎంలను విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు.
ఆసుపత్రికి వచ్చిన రోగులతో కలెక్టర్ మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించడం వైద్యులు, సిబ్బంది ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు.
వైద్యులు, సిబ్బంది విధులకు సమయానికి హాజరై తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, రోగులకు వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.








