రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి
బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్
ఆధాబ్ న్యూస్, కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కలవలనాగారం గ్రామానికి చెందిన యువకుడు భాదావత్ రవిచంద్ర మృతి ఘటనపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ చేపట్టి, ఘటనకు బాధ్యులుగా తేలిన వారిని వెంటనే అరెస్టు చేసి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కరకగూడెం మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువకుడి మృతి ఘటనలో వాస్తవాలు వెలుగులోకి రావడంలో జాప్యం జరగడం, బాధిత కుటుంబానికి న్యాయం అందకపోవడం ఆమోదయోగ్యం కాదన్నారు. రవిచంద్ర మృతి వెనుక ఉన్న వాస్తవాలను పోలీసులు పూర్తిస్థాయిలో వెలికితీయాలని, ఘటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలించాలని కోరారు.
విచారణలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా సాక్ష్యాధారాల ఆధారంగా బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. పలుకుబడి ఉన్నవారైనా, సామాన్యులైనా చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొన్నారు. రవిచంద్ర మృతి ఘటనను సాధారణ విషయంగా తీసుకోకుండా, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.
కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించి, సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడంతో పాటు పోస్టుమార్టం నివేదిక, ఇతర అందుబాటులో ఉన్న ఆధారాలను సమగ్రంగా పరిశీలించాలని జాడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విచారణ పారదర్శకంగా సాగేందుకు బాధిత కుటుంబానికి అవసరమైన భద్రత కల్పించాలని, కేసు పురోగతిపై కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కోరారు.
రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి, బాధ్యులుగా తేలిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించే వరకు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు. ఆదివాసీల ప్రాణాలకు, హక్కులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కరకగూడెం మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.








