దుమ్ముతో ఉక్కిరిబిక్కిరి.. లారీలతో రహదారి దిగ్బంధం
CSP కాట సమీపంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమా?
మణుగూరు, అక్టోబర్ 5 (ఆధాబ్ న్యూస్): మణుగూరు CSP కాట సమీపంలోని ప్రధాన రహదారి దుమ్ము, బొగ్గు ధూళి, లారీల నిలుపుదలతో ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారికి ఇరువైపులా భారీ లారీలను నిలిపివేయడంతో పాటు రోడ్డుపై పేరుకుపోయిన మట్టి, బొగ్గు ధూళి వాహనాల రాకపోకలతో గాలిలోకి ఎగసిపడుతోంది.
దీంతో ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు, పాదచారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. దుమ్ము కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు సైతం స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన రహదారేనా.. లారీ పార్కింగ్ స్థలమా?
రహదారికి ఇరువైపులా లారీలను నిలిపివేయడంతో రహదారి వెడల్పు తగ్గిపోతుందని, ఫలితంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజన్లు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు.
లారీల పార్కింగ్ కోసం సింగరేణి యాజమాన్యం ఓల్డ్ స్టోర్ ప్రాంతంలో ప్రత్యేక స్థలం ఏర్పాటు చేసినప్పటికీ, ప్రధాన రహదారిపైనే లారీలను నిలిపివేయడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పార్కింగ్ స్థలం ఉన్నప్పుడు రహదారిపైనే లారీలను నిలిపివేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
దుమ్ముతో ప్రజారోగ్యానికి ముప్పు
రోడ్డుపై పేరుకుపోయిన మట్టి, బొగ్గు ధూళి వాహనాల రాకపోకలతో గాలిలో కలుస్తుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. సమస్యను కేవలం ట్రాఫిక్ సమస్యగా కాకుండా ప్రజారోగ్యం, రహదారి భద్రతకు సంబంధించిన అంశంగా అధికారులు పరిగణించాలని కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో సామాజిక బాధ్యత కలిగిన పౌరుడు కర్నే బాబురావు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో మణుగూరు MPDOకు వినతిపత్రం సమర్పించి సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్
CSP కాట సమీపంలోని ప్రధాన రహదారిపై క్రమం తప్పకుండా నీటిని చల్లి దుమ్ము ఎగరకుండా చర్యలు తీసుకోవాలని, రోడ్డుపై పేరుకుపోయిన మట్టి, బొగ్గు ధూళిని యంత్రాలతో తొలగించాలని బాబురావు కోరారు.
రహదారికి ఇరువైపులా లారీలను నిలిపివేయకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, ఓల్డ్ స్టోర్‌లో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో వినియోగించేలా చూడాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ, పోలీస్, ట్రాఫిక్, సింగరేణి యాజమాన్యం, సెక్యూరిటీ విభాగం, సంబంధిత శాఖల అధికారులు సంయుక్తంగా స్థల పరిశీలన నిర్వహించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
అవసరమైన చోట హెచ్చరిక బోర్డులు, ట్రాఫిక్ సూచికలు ఏర్పాటు చేసి అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజన్లు వంటి అత్యవసర వాహనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
“ప్రజలు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సమస్యను అధికారులు కాగితాలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలి. దుమ్ము, లారీ పార్కింగ్ సమస్యలకు తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలి” అని కర్నే బాబురావు కోరారు.









