అశ్వాపురంపాడులో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
నేరాల నియంత్రణకు పోలీసులకు సహకరించాలి: డీఎస్పీ రవీందర్‌రెడ్డి
చిన్నారులకు దుస్తుల పంపిణీ
మణుగూరు, సెప్టెంబర్ 28 (ఆధాబ్ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు కరకగూడెం పోలీసుల ఆధ్వర్యంలో కరకగూడెం మండలం అశ్వాపురంపాడు గ్రామంలో సోమవారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసులు గ్రామంలోని పలు ఇళ్లను తనిఖీ చేసి, అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలు, నేరాలకు సంబంధించిన అంశాలపై ఆరా తీశారు. గ్రామంలో నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది అశ్వాపురంపాడు గ్రామంలో మూడు నేర ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలో నేరాలు పునరావృతం కాకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తున్నా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు.
అనంతరం గ్రామంలోని చిన్నారులకు పోలీసులు దుస్తులను పంపిణీ చేశారు. పోలీసు శాఖ శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా ప్రజలతో మమేకమై వారి సంక్షేమానికి కూడా కృషి చేస్తుందని డీఎస్పీ తెలిపారు. గ్రామస్థులు తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై పీవీఎన్ రావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.









