కరకగూడెం మండలంలో ఉత్సాహంగా ‘ఉల్లాస్’ పరీక్షలు
319 మంది అభ్యాసకులకు 16 కేంద్రాల్లో పరీక్షలు
కరకగూడెం, సెప్టెంబర్ 27 (ఆధాబ్ న్యూస్):
కరకగూడెం మండలంలో గ్రామీణాభివృద్ధి సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో ‘ఉల్లాస్’ వయోజన విద్యా పరీక్షలు ఆదివారం ఉత్సాహంగా నిర్వహించారు. మండలంలో గుర్తించిన 16 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 319 మంది అభ్యాసకులు పరీక్షలకు హాజరయ్యారు.
గత సంవత్సరం ప్రారంభమైన ఉల్లాస్ వయోజన విద్యా కార్యక్రమంలో భాగంగా విద్య మధ్యలో ఆపివేసిన అభ్యాసకులతో పాటు, గత సంవత్సరం పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత సాధించలేకపోయిన 75 మంది, నూతనంగా విద్యను అభ్యసించిన 244 మంది అభ్యాసకులకు ఈ పరీక్షలు నిర్వహించారు.
పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యాసకులు తెలంగాణ ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ విద్యను అభ్యసించేలా ప్రోత్సహించడమే ఉల్లాస్ కార్యక్రమం లక్ష్యమని అధికారులు తెలిపారు.
మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి. శ్రీనివాస్, విద్యాశాఖ అధికారి మంజుల, గ్రామపంచాయతీ సర్పంచ్‌ల సమన్వయంతో పాటు ఆయా పరీక్షా కేంద్రాల్లోని ఉల్లాస్ వాలంటీర్లు, వీఓఏల సహకారంతో పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సెర్ప్ ఏపీఎం బి. వినోద్ క్రాంతి, అధ్యక్షురాలు సరస్వతి, సీసీలు విజయలక్ష్మి, సత్యనారాయణ, అన్ని గ్రామపంచాయతీల కార్యదర్శులు, వీవీఓఏలు, ఉల్లాస్ వాలంటీర్లు పాల్గొన్నారు.









