ములుగు జిల్లాలో అధ్వాన్నంగా రహదారులు.. గుంతలో దిగబడిన ఆర్టీసీ బస్సు
గుంతలమయంగా కమలాపురం–ఏటూరునాగారం ప్రధాన రహదారి.. వాహనదారుల అవస్థలు
మంగపేట, సెప్టెంబర్ 26 (ఆధాబ్ న్యూస్): ములుగు జిల్లాలో రహదారుల పరిస్థితి రోజురోజుకూ అధ్వాన్నంగా మారుతోంది. మంగపేట మండలం కమలాపురం–ఏటూరునాగారం ప్రధాన రహదారిపై భారీగా ఏర్పడిన గుంతల్లో ఓ ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు దిగబడిపోయింది. దీంతో కొంతసేపు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
బస్సు గుంతలో దిగబడటంతో రహదారిపై ఇసుక లారీలు భారీగా నిలిచిపోయాయి. దీంతో అటుగా ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుంతలు పెద్దవిగా మారడంతో వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నాయని స్థానికులు తెలిపారు.
ఇసుక లారీల రాకపోకలు అధికంగా ఉండటంతోనే రహదారులు పూర్తిగా ధ్వంసమవుతున్నాయని వాహనదారులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే గుంతల కారణంగా పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వర్షాల సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని పేర్కొన్నారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కమలాపురం–ఏటూరునాగారం ప్రధాన రహదారికి మరమ్మతులు చేపట్టి, రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.









