గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడి ఆస్తుల జప్తు
రూ.21.15 లక్షల విలువైన రెండు కార్లు, బైక్, బ్యాంక్ ఖాతా సీజ్
ఏడూళ్ల బయ్యారం పోలీసుల ఆర్థిక దర్యాప్తులో కీలక పరిణామం
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 24 (ఆధాబ్ న్యూస్): గంజాయి అక్రమ కొనుగోలు, రవాణా కేసులో నిందితుడిపై పోలీసులు కొరడా ఝుళిపించారు. నేర కార్యకలాపాల ద్వారా సంపాదించినట్లు గుర్తించిన ఆస్తులను ఆర్థిక దర్యాప్తులో భాగంగా జప్తు చేసినట్లు ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు.
2025 ఆగస్టు 28న ఏడూళ్ల బయ్యారం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన Cr.No.136/2025, NDPS Act-1985లోని 8(C) r/w 20(b)(ii)(C), 27(A), 29 సెక్షన్ల కేసులో పల్లపు రఘు నిందితుడిగా ఉన్నారు. గంజాయి అక్రమ రవాణా ద్వారా సంపాదించినట్లు గుర్తించిన ఆస్తులపై పోలీసులు ఆర్థిక దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా నిందితుడి పేరుతో ఉన్న రెండు కార్లు, ఒక మోటార్‌సైకిల్‌తో పాటు అతని భార్యకు సంబంధించిన బ్యాంకు ఖాతాను గుర్తించారు. చెన్నై కాంపిటెంట్ అథారిటీ నుంచి ఫ్రీజింగ్ ఆర్డర్ పొందిన అనంతరం, గౌరవ న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు సంబంధిత ఆస్తులు, బ్యాంకు ఖాతాను జప్తు చేసినట్లు సీఐ వెల్లడించారు.
జప్తు చేసిన రెండు కార్లు, మోటార్‌సైకిల్, బ్యాంకు ఖాతా విలువ కలిపి మొత్తం సుమారు రూ.21,15,907గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడి వివరాలు
పల్లపు రఘు, ఎల్లయ్య కుమారుడు, వయస్సు 35 సంవత్సరాలు. వృత్తిరీత్యా కారు డ్రైవర్. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం మండేపల్లి గ్రామానికి చెందిన రఘు ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గంజాయి అక్రమ కొనుగోలు, రవాణా వంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, నేరాల ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించి జప్తు చేసేందుకు నిరంతరం చర్యలు చేపడుతున్నట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు.
నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు నేరం ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించి జప్తు చేసేలా సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టిన ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.









