రూ.14 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హాస్టల్ వార్డెన్
ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో దాడి
ఆధాబ్ న్యూస్ ,చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురం ఎస్టీ బాయ్స్ హాస్టల్లో వార్డెన్‌గా విధులు నిర్వహిస్తున్న భూక్యా వాల్ సింహ రూ.14 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
హాస్టల్లో వర్కర్‌గా (కుక్) పనిచేస్తున్న వ్యక్తికి జీతం చెల్లించే విషయంలో వార్డెన్ లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. లంచం ఇవ్వడం ఇష్టం లేని కుక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో అధికారులు ముందస్తు ప్రణాళికతో దాడి నిర్వహించారు.
ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు శుక్రవారం దాడి నిర్వహించి, రూ.14 వేల లంచం తీసుకుంటుండగా వార్డెన్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టినట్లు సమాచారం.
మారుమూల ప్రాంతాల నుంచి కూడా అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు ఏసీబీకి అందుతున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు వరుసగా దాడులు నిర్వహిస్తూ లంచం తీసుకుంటున్న వారిని పట్టుకుంటున్నారు.









