నకిలీ పన్నీర్‌పై ఏడాది నిషేధం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. తయారీ నుంచి విక్రయం వరకు బంద్
ఆధాబ్ న్యూస్ ,హైదరాబాద్: ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా పాలతో తయారు చేయని కృత్రిమ పన్నీర్ (నాన్ డెయిరీ/ఆర్టిఫిషియల్/అనలాగ్ పన్నీర్)పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కృత్రిమ పన్నీర్ తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, పంపిణీ, రవాణా, విక్రయాలను ఏడాది పాటు నిషేధించింది.
ఈ మేరకు రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయగా, సెప్టెంబర్ 10న తెలంగాణ గెజిట్‌లో అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. నిషేధం సెప్టెంబర్ 10 నుంచే తక్షణమే అమల్లోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ఆహార భద్రత, ప్రమాణాల చట్టం–2006లోని సెక్షన్ 30(2)(ఎ) కింద ఉన్న అధికారాలను వినియోగించి ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
పాలతో తయారయ్యే అసలైన పన్నీర్‌కు ప్రత్యామ్నాయంగా ఇతర పదార్థాలతో తయారు చేసే నాన్ డెయిరీ, ఆర్టిఫిషియల్, అనలాగ్ పన్నీర్‌ను ఏ రూపంలో ఉన్నా తయారు చేయడం నుంచి విక్రయించడం వరకు నిషేధం వర్తించనుంది.
హోటళ్లు, రెస్టారెంట్లకు వర్తింపు
రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు, విక్రయ సంస్థలు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. కృత్రిమ పన్నీర్‌ను తయారు చేయడం, నిల్వ చేయడం, సరఫరా చేయడం లేదా విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై ఆహార భద్రత, ప్రమాణాల చట్టం–2006తో పాటు సంబంధిత నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రత అధికారులు తనిఖీలను ముమ్మరం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, పన్నీర్ తయారీ కేంద్రాలు, నిల్వ కేంద్రాలు, విక్రయ సంస్థల్లో కృత్రిమ పన్నీర్ తయారీ, నిల్వ, సరఫరా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.









