అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
మంత్రాల నేపథ్యమే కారణమా..?
ఛాతిపై కత్తిపోటు ఆనవాళ్లు.. హత్య కోణంలో పోలీసుల దర్యాప్తు
ఆళ్లపల్లి ,ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల పరిధిలోని మర్కోడు గ్రామ శివారులో శనివారం ఉదయం ఓ వ్యక్తి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
మర్కోడు గ్రామపంచాయతీ పరిధిలోని సుద్దరేవు గ్రామానికి చెందిన పూనెం రామ్ నారాయణ (50) మర్కోడు జల్లేరు వాగు ఒడ్డున మృతిచెందిన స్థితిలో కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
స్థానికుల కథనం ప్రకారం.. రామ్ నారాయణ వలస గుత్తి కోయ తెగకు చెందిన వ్యక్తి. సుమారు నాలుగేళ్ల క్రితం సుద్దరేవు గ్రామానికి వచ్చి అక్కడే నివాసం ఉంటున్నాడు. భూతాలు పట్టిన వారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మంత్రాలు, నాటు మందులతో పూజలు చేసి నయం చేస్తాడని గ్రామస్తులు తెలిపారు.
అయితే మృతుడి ఛాతిపై కత్తితో దాడి చేసినట్లు కనిపించే ఆనవాళ్లు ఉండటంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రాల నేపథ్యమే ఘటనకు కారణమై ఉండవచ్చనే అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నప్పటికీ, దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ కాలేదు.
స్థానిక ఎస్సై సోమేశ్వర్ మాట్లాడుతూ.. మృతుడి ఛాతిపై కత్తితో దాడి చేసినట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని తెలిపారు. హత్య జరిగి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం మృతికి గల అసలు కారణం, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయని ఎస్సై తెలిపారు.
పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.









