జర్నలిస్టులకు ఎల్ఐజీ స్కీం వర్తింపజేయాలి
హౌసింగ్ టవర్లు నిర్మించి 2బీహెచ్‌కే ఫ్లాట్లు ఇవ్వాలి
లేదా 200 గజాల స్థలం కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
ఖమ్మం ప్రెస్‌క్లబ్ విచారణ పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించాలి
కలెక్టర్ దివాకర టి.ఎస్‌ను కోరిన డబ్ల్యూజేఐ ప్రతినిధులు
ఖమ్మం, సెప్టెంబర్ 11 (ఆధాబ్ న్యూస్): జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించడంతో పాటు ఖమ్మం ప్రెస్‌క్లబ్ ఎన్నికలను వెంటనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) ఖమ్మం జిల్లా ప్రతినిధులు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్‌ను కోరారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో అమలవుతున్న ఎల్ఐజీ (లో ఇన్కమ్ గ్రూప్) హౌసింగ్ స్కీంను జర్నలిస్టులకు కూడా వర్తింపజేయాలని డబ్ల్యూజేఐ ప్రతినిధులు కోరారు. జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా హౌసింగ్ టవర్లను నిర్మించి, సుమారు 1,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2బీహెచ్‌కే ఫ్లాట్లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రతిపాదన సాధ్యం కాని పక్షంలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు 200 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించి, ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేయాలని కోరారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాల సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా డబ్ల్యూజేఐ రాష్ట్ర కార్యదర్శి నారా సుబ్రమణ్యేశ్వర రావు (ఎన్.ఎస్. రావు), జిల్లా కన్వీనర్ గంటెల ఆనంద్, కో-కన్వీనర్ ఎం.ఏ. అన్సార్ పాషా, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం, ప్రెస్‌క్లబ్ ఇన్చార్జి కె. కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా నాయకులు జాబిశెట్టి కుటుంబరావు, ఏనిగండ్ల శ్రీనివాసరావు, బొడ్డుపల్లి రవీందర్, పసుపులేటి ఉపేందర్ తదితరులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ప్రెస్‌క్లబ్ ఎన్నికలు జరపాలి
ఖమ్మం ప్రెస్‌క్లబ్ ఎన్నికల నిర్వహణపై కూడా డబ్ల్యూజేఐ ప్రతినిధులు కలెక్టర్‌తో సుదీర్ఘంగా చర్చించారు. చాలా కాలంగా ప్రెస్‌క్లబ్‌కు ఎన్నికలు జరగడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ప్రెస్‌క్లబ్ నిర్వహణపై కొనసాగుతున్న విచారణను త్వరితగతిన పూర్తి చేసి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
డబ్ల్యూజేఐ ప్రతినిధుల విజ్ఞప్తిపై కలెక్టర్ దివాకర టి.ఎస్. సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించిన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. అలాగే ప్రెస్‌క్లబ్‌కు సంబంధించిన విచారణను పూర్తి చేసి ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.









