ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  కొత్తగూడెం గగనతలానికి రెక్కలు!

కొత్తగూడెం గగనతలానికి రెక్కలు!

విమానాశ్రయ కల సాకారం దిశగా అడుగులు

మణుగూరు సహా పలు ప్రాంతాల్లో ఏవీఎస్‌ సాంకేతిక బృందం పరిశీలన

కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుతో మంత్రి తుమ్మల చర్చలు

వారం, పది రోజుల్లో సమగ్ర నివేదిక

కొత్తగూడెం, సెప్టెంబర్ 9 (ఆధాబ్ న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల దశాబ్దాల కల అయిన విమానాశ్రయ ఏర్పాటుపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. విమానాశ్రయానికి అనువైన ప్రాంతాన్ని గుర్తించే ప్రక్రియ వేగవంతమైంది. హైదరాబాద్, ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ఏవీఎస్‌ అధికారులు, సాంకేతిక నిపుణుల బృందాలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాయి.

ఇప్పటికే గుర్తించిన ప్రాంతాలతోపాటు మణుగూరు ప్రాంతాన్ని కూడా ప్రత్యేక బృందం పరిశీలించడం ప్రాధాన్యం సంతరించుకుంది. విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన రన్‌వేకు అనువైన భూభాగం, భౌగోళిక పరిస్థితులు, వాతావరణం, పరిసర ప్రాంతాల స్వభావం, భూసేకరణ అవకాశాలు తదితర అంశాలను అధికారులు పరిశీలించారు.

కేంద్ర మంత్రితో తుమ్మల కీలక చర్చలు

కొత్తగూడెం విమానాశ్రయ ఏర్పాటుపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో పాటు సంబంధిత ఏవియేషన్‌ అధికారులతో చర్చించారు. భద్రాచలం పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు, జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాలు, పర్యాటక రంగం అభివృద్ధికి విమానాశ్రయం ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

జిల్లాకు విమానాశ్రయం అత్యవసరమని, సాంకేతికంగా అనువైన ప్రాంతాన్ని గుర్తించి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని మంత్రి తుమ్మల కోరారు. సాంకేతిక బృందాల పరిశీలన అనంతరం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం.

మణుగూరుపై ప్రత్యేక దృష్టి

గతంలో గుర్తించిన ప్రాంతాలు కొన్ని సాంకేతిక కారణాలతో అనుకూలంగా లేకపోవడంతో విమానాశ్రయ ప్రతిపాదనకు ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో ప్రత్యామ్నాయ ప్రాంతాలపై అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా మణుగూరు పరిసరాలను కూడా ఏవీఎస్‌ అధికారులు పరిశీలించారు.

రన్‌వే నిర్మాణానికి అవసరమైన భూమి, విమానాల రాకపోకలకు అనుకూలత, భౌగోళిక పరిస్థితులు, భూసేకరణ తదితర అంశాలను పరిశీలించి, ఇతర ప్రాంతాలతో పోల్చి చూడనున్నారు.

10 రోజుల్లో తేలనున్న కీలక విషయం

క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం వారం నుంచి పది రోజుల్లో సమగ్ర నివేదికను సమర్పిస్తామని అధికారులు వెల్లడించారు. సాంకేతిక బృందం నివేదికలో పేర్కొనే అంశాల ఆధారంగా విమానాశ్రయ నిర్మాణానికి తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

విమానాశ్రయం ఏర్పాటైతే భద్రాచలం రామాలయానికి వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతోపాటు కొత్తగూడెం, మణుగూరు పారిశ్రామిక ప్రాంతాలకు భారీ ప్రయోజనం కలగనుంది. పర్యాటక రంగం అభివృద్ధితో పాటు జిల్లాలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.

దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న భద్రాద్రి జిల్లా ప్రజల విమానాశ్రయ కలకు తాజా సాంకేతిక పరిశీలనలు ఎంతవరకు మార్గం సుగమం చేస్తాయో.. అధికారుల నివేదికతో తేలనుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు