అక్షరాస్యతతో ఉన్నత లక్ష్యాలను సాధించాలి.ఎంపీడీవో పి. శ్రీనివాస్
కరకగూడెంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ర్యాలీ, సమావేశం
కరకగూడెం, ఆధాబ్ న్యూస్: అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్డీఏ-సెర్ప్, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కరకగూడెం మండలంలో అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించారు. అక్షరమాల పక్షోత్సవాల్లో భాగంగా గత ఏడాది ఉల్లాస్ కార్యక్రమం “అమ్మకు అక్షర మాల” ద్వారా విద్యను అభ్యసించిన అభ్యాసకులు, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి అనంతరం సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీడీవో పి. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యాబుద్ధులు నేర్చుకుని ఉన్నత లక్ష్యాలను సాధించడంతో పాటు తమ చుట్టూ ఉన్న వారికి కూడా విద్యను అందించాలని సూచించారు. చదువును మధ్యలో నిలిపివేసిన వారు ఓపెన్ టెన్త్, ఇంటర్ ద్వారా విద్యను కొనసాగించేలా ప్రోత్సహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎపీఎం సెర్ప్ బి. వినోద్ క్రాంతి, హైస్కూల్ ఇన్చార్జి పుష్పలత, సీసీలు విజయలక్ష్మి, సత్యనారాయణ, మండల సమాఖ్య అధ్యక్షురాలు సరస్వతి, ఉపాధ్యాయులు, వీవోఏలు, అభ్యాసకులు, విద్యార్థులు పాల్గొన్నారు.









