తుక్కుగూడ నర్సు హత్యాచార ఘటనపై మెజిస్టీరియల్ విచారణ
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్:తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సు హత్యాచారానికి గురైన ఘటనను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, బాధితురాలు ఉంటున్న వసతి ప్రదేశంలో భద్రతా ఏర్పాట్లు, ఆసుపత్రి యాజమాన్యం లేదా సంబంధిత సంస్థ నిర్వహణలో ఏమైనా నిర్లక్ష్యం జరిగిందా, మహిళా ఉద్యోగుల భద్రతకు సంబంధించి పాటించాల్సిన నిబంధనలు అమలయ్యాయా అనే అంశాలను విచారణలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కేసులో నిందితుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో దర్యాప్తును పకడ్బందీగా, వేగంగా పూర్తి చేయాలని సీఎం సూచించారు. ఫోరెన్సిక్ నివేదికలు, ఇతర సాంకేతిక ఆధారాల సేకరణను త్వరితగతిన పూర్తి చేసి సమగ్ర ఛార్జ్‌షీట్ దాఖలు చేసేలా పోలీసు ఉన్నతాధికారులు కేసును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టేలా అవసరమైన చర్యలు ప్రారంభించాలని సీఎం సూచించారు. న్యాయశాఖ, పోలీసు శాఖ, ప్రాసిక్యూషన్ విభాగాలు సమన్వయంతో పనిచేసి కేసు విచారణలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటికే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి అనసూయ సీతక్క బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
ఘటనకు కారణమైన వ్యవస్థాపరమైన లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దాలని అధికారులను సీఎం ఆదేశించారు. భవిష్యత్తులో మహిళా ఉద్యోగుల భద్రతకు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన భద్రతా చర్యలను పటిష్టం చేయాలని సూచించారు.









