రాగి-జొన్న జావలతో ప్రజా ఆరోగ్యానికి బాటలు
ఆర్గానిక్ ఆహారంపై అవగాహన కల్పించిన పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి
బూర్గంపహాడ్, ఫిబ్రవరి 19 ఆధాబ్ న్యూస్:
మొరంపల్లి బంజర్‌లోని పల్లెజావ దుకాణంలో లక్ష్మీపురం మాజీ ఉప సర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఆర్గానిక్ ఆహారం, చిరుధాన్యాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య సంరక్షణే ప్రధాన ధ్యేయంగా పల్లెల్లో సహజ పద్ధతుల్లో పండే రాగి, జొన్న, గోధుమల వినియోగాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. టీ, కాఫీ వంటి పానీయాలకంటే రాగి, జొన్న జావలు తీసుకోవడం వల్ల షుగర్, రక్తపోటు వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉందని, జీర్ణవ్యవస్థ మెరుగుపడడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు.
అలాగే రసాయనాలు లేకుండా పండించే ఆర్గానిక్ పంటలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యంతో పాటు రైతులకు ఆర్థిక లాభాలు కూడా చేకూరుతాయని పేర్కొన్నారు. యువత, రైతులు సహజ ఆహారపు అలవాట్లను దైనందిన జీవన విధానంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలాంటి సామాజిక అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా జరిగితే గ్రామీణ ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుందని, పల్లెల్లో ఆర్గానిక్ జావ దుకాణాలు పెరగడం ద్వారా ప్రజలకు, రైతులకు సమగ్ర ప్రయోజనం కలుగుతుందని అన్నారు.
రైతుల సమిష్టి కృషితో ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు తాను ఎల్లప్పుడూ సహకరిస్తానని పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.








