బ్యాలెట్ బాక్సుల పంపిణీ కేంద్రాల పరిశీలన
ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: జిల్లా ఎస్పీ
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
కొత్తగూడెం కార్పొరేషన్, ఇల్లందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో బుధవారం జరగనున్న పోలింగ్‌ను పురస్కరించుకుని జిల్లాలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.
ఈ సందర్భంగా పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్సుల పంపిణీ కేంద్రాలను జిల్లా ఎస్పీ పరిశీలించారు. అక్కడ విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద సుమారు 1200 మంది పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.
పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిరంతర నిఘా కోసం ప్రత్యేక బృందాలను నియమించామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఓట్ల లెక్కింపు కేంద్రంగా ఉన్న పాల్వంచ అనుబోస్ కళాశాల పరిసరాల్లో డాగ్స్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లతో నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు లోనుకాకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.









