కార్మికులు, కష్టజీవుల కుటుంబాలకు ఎస్బిఐ వ్యక్తిగత ప్రమాద భీమా భరోసా
– బాపట్ల ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ వి. ఆనంద్ బాబు వెల్లడి
బాపట్ల,ఆధాబ్ న్యూస్:
కార్మికులు, కష్టజీవులు మరియు నిరుపేద కుటుంబాలకు ఆపద సమయంలో భరోసా కల్పించే విధంగా State Bank of India (ఎస్బిఐ) ప్రత్యేక వ్యక్తిగత ప్రమాద భీమా పాలసీని అందుబాటులో ఉంచిందని బాపట్ల ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ వి. ఆనంద్ బాబు తెలిపారు.
శనివారం ఆయన మాట్లాడుతూ…
ప్రచారం లోపించడంతో ఈ భీమా పాలసీపై చాలా మంది ఖాతాదారులకు సరైన అవగాహన లేకపోతున్నదని, ఫలితంగా సామాన్య మరియు మధ్య తరగతి కుటుంబాలు ఈ అవకాశాన్ని కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపద సమయంలో ఎవరో సహాయం చేస్తారని ఎదురుచూడకుండా, తక్కువ ప్రీమియంతోనే పూర్తి రక్షణ కల్పించే భీమా పాలసీ ఎస్బిఐలో ఉందని ఆయన స్పష్టం చేశారు.
సంవత్సరానికి కేవలం రూ.2,000/- (రోజుకు సుమారు రూ.6/- మాత్రమే) ప్రీమియంతో రూ.40 లక్షల వరకు ప్రమాద భీమా కవరేజ్ పొందవచ్చని వివరించారు.
రోడ్డు ప్రమాదం, విద్యుత్ షాక్, వరదలు, భూకంపాలు, పాము కాటు, తేలు కాటు వంటి ఏవైనా ప్రమాదాల వల్ల పాలసీదారునికి మరణం సంభవిస్తే, ఆయన నామినీకి రూ.40 లక్షల భీమా మొత్తం లభిస్తుందని వి. ఆనంద్ బాబు తెలిపారు.
చాలా కాలంగా ఈ సదవకాశం ఉన్నప్పటికీ, పూర్తి సమాచారం లేకపోవడం వల్ల అనేక మంది ఖాతాదారులు లాభం పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. కాబట్టి ఎస్బిఐ ఖాతాదారులు, పాలసీదారులు ఈ వ్యక్తిగత ప్రమాద భీమా పాలసీపై సమగ్ర వివరాలు తెలుసుకొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.









