కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలం అనంతారం గ్రామంలో విద్యుత్ శాఖపై కొందరు వ్యక్తులు చేసిన తప్పుడు ఆరోపణలు మరియు పత్రికల్లో వచ్చిన అవాస్తవ కథనాలపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన చీఫ్ జనరల్ మేనేజర్ (ఆడిట్) రవీంద్రనాథ్ సమగ్ర విచారణ నిర్వహించారు.
ఈ విచారణలో అనంతారం గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ సభ్యులు, ప్రజాప్రతినిధులు తమ వాఖ్యాలను నమోదు చేయగా, అవన్నీ విద్యుత్ శాఖకు పూర్తిగా అనుకూలంగా ఉన్నట్లు తేలింది. గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం ఇరు వర్గాల మధ్య ఏర్పడిన విభేదాల నేపథ్యంలో, కొందరు వ్యక్తులు వ్యక్తిగత కక్షతో విద్యుత్ శాఖ అధికారులపై నిరాధార ఆరోపణలు చేసినట్లు గ్రామ ప్రజలు తెలిపారు.
విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు లోనుకాకుండా, నిబంధనలకు లోబడి, నిజాయితీగా విధులు నిర్వహిస్తున్నారని ప్రజలు ఏకగ్రీవంగా పేర్కొన్నారు. తమ స్వస్థలాలకు దూరంగా ఉండి కూడా హెడ్‌క్వార్టర్స్‌లోనే నివసిస్తూ, చిన్నపాటి విద్యుత్ సమస్య వచ్చినా తక్షణమే స్పందిస్తూ, రాత్రి పగలు తేడా లేకుండా సేవలందిస్తున్నారని గ్రామ ప్రజలు ప్రశంసించారు.
ఇతర శాఖలతో పోలిస్తే గ్రామ ప్రజలకు అత్యుత్తమమైన, వేగవంతమైన మరియు నమ్మకమైన సేవలు అందిస్తున్న శాఖగా విద్యుత్ శాఖ గుర్తింపు పొందిందని తెలిపారు. రాజకీయ భేదాభిప్రాయాలను పక్కనబెట్టి, విద్యుత్ శాఖ సేవలపై గ్రామ ప్రజలందరూ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.
గ్రామ సర్పంచ్ పాయం కృష్ణవేణి, ఉపసర్పంచ్ పూజారి వెంకన్న ఆధారాలు లేని ఆరోపణలు, తప్పుడు ప్రచారాలను గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించరాదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, విద్యుత్ శాఖకు పూర్తి మద్దతు ప్రకటించారు.
ఈ విచారణలో డీఈ కె. జీవన్ కుమార్, ఏడీఈ ఉమా మహేశ్వరరావు, ఇన్‌చార్జ్ అసిస్టెంట్ ఇంజనీర్ రాజశేఖర్, లైన్మెన్ జి. నరసింహారావు పాల్గొని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు విద్యుత్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
విచారణ ఫలితంగా, విద్యుత్ శాఖపై చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పుడు, అవాస్తవమైనవని తేలిందని గ్రామ ప్రజలు వెల్లడించారు. అనంతారం గ్రామ ప్రజలు విద్యుత్ శాఖపై పూర్తి విశ్వాసం కలిగి ఉన్నారని ఈ సందర్భంగా మరోసారి స్పష్టమైంది.









