🤳 ఫోన్లోనే ఆధార్ మొబైల్ నంబర్ అప్డేట్ సౌకర్యం
నేటి నుంచి అమల్లోకి – ఇక ఎన్రోల్మెంట్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు
హైద్రాబాద్,ఆధాబ్ న్యూస్:
ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవడం ఇక మరింత సులభం కానుంది. బుధవారం నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చిందని యూఐడీఏఐ (UIDAI) ప్రకటించింది. ఈ విధానం ద్వారా ఎక్కడి నుంచైనా, ఏ సమయంలోనైనా ఫోన్లోనే ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
ఇప్పటివరకు మొబైల్ నంబర్ మార్పు కోసం తప్పనిసరిగా ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉండేది. తాజా నిర్ణయంతో ఆ అవసరం పూర్తిగా తొలగిపోయింది.
కొత్తగా అమల్లోకి వచ్చిన విధానంలో ఫేస్ ఆథెంటికేషన్తో పాటు ఓటీపీ (OTP) ఆధారంగా మొబైల్ నంబర్ అప్డేట్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఈ విధానం పూర్తిగా ఆన్లైన్లో జరుగుతుండటంతో ప్రజలకు సమయం, ఖర్చు రెండూ ఆదా కానున్నాయి.
డిజిటల్ సేవలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు, ఉద్యోగులు, వృద్ధులకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగకరంగా మారనుంది.









