షోరూంలోనే వాహనాల రిజిస్ట్రేషన్.. నేటి నుంచే అమల్లోకి ‘డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్’ విధానం
హైద్రాబాద్,ఆధాబ్ న్యూస్:
రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఇకపై ఆర్టీవో కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలకు పూర్తిగా ముగింపు పలకనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్’ విధానం నేటి నుంచే అధికారికంగా అమల్లోకి వచ్చింది.
ఈ విధానానికి సంబంధించిన ట్రయల్ రన్‌ను నిన్న మాదాపూర్‌లో నిర్వహించగా, అది విజయవంతంగా పూర్తయినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇకపై వాహనం కొనుగోలు చేసిన అదే షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవనుంది.
వాహన కొనుగోలు సమయంలోనే షోరూమ్ సిబ్బంది వాహనదారుడి ఫొటోలు, అవసరమైన డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేస్తారు. అనంతరం అక్కడికక్కడే వాహనానికి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించనున్నారు. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) నేరుగా వాహనదారుడి ఇంటికే పోస్టు ద్వారా అందనుంది.
ఈ కొత్త విధానంతో వాహనదారులకు సమయం, ఖర్చు ఆదా అవడమే కాకుండా, ఆర్టీవో కార్యాలయాల్లో రద్దీ కూడా గణనీయంగా తగ్గనుందని అధికారులు పేర్కొన్నారు.









