భారత గడ్డపై సిపిఐ నూరేళ్ల చరిత్ర
18న ఖమ్మంలో జరిగే సభను జయప్రదం చేయండి : షాబీర్ పాషా
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆవిర్భవించి భారత గడ్డపై నూరేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న జిల్లా ప్రచార జాతా ఆదివారం కరకగూడెం మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా మండలంలోని సిపిఐ నాయకులు, కార్యకర్తలు జాతాకు ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా మాట్లాడుతూ, సిపిఐ నూరేళ్ల చరిత్ర అలుపెరగని పోరాటాలకు ప్రతీకగా నిలిచిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పార్టీగా సిపిఐ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుందన్నారు. అనేక రాష్ట్రాల్లో సాయుధ పోరాటాలు, దేశవ్యాప్తంగా సమరశీల ఉద్యమాలు నిర్వహించిన ఘన చరిత్ర సిపిఐకుందని తెలిపారు.
కమ్యూనిస్టులపై మతోన్మాద దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, ప్రజలు చైతన్యవంతులై ఈ మతోన్మాద ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సుదీర్ఘ పోరాట చరిత్ర ఉందని, ఈ ఎర్రజెండాను ప్రజలు గుండెల్లో పెట్టుకుని ప్రేమించారన్నారు.
పోరాటాల ఖిల్లాగా పేరుగాంచిన ఖమ్మం గడ్డపై దేశవ్యాప్త సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ ఈ నెల 18న నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే పులుసు బొంత ప్రాజెక్టు విషయంలో సిపిఐ ఎన్నో సంవత్సరాలుగా సర్వతోముఖ పోరాటాలు చేస్తోందని, ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రత్యేకంగా విన్నపం చేస్తామని షాబీర్ పాషా పేర్కొన్నారు.
ఈ సభకు గ్రామగ్రామాన నుంచి సిపిఐ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ కరకగూడెం మండల కార్యదర్శి వంగరి సతీష్, జిల్లా అధ్యక్షురాలు మొన్న లక్ష్మీకుమారి, రాష్ట్ర కార్యసభ్యులు కల్లూరు వెంకటేశ్వర్లు, బుడగం సతీష్, బోడ ముత్తయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.









