భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
పాల్వంచ పట్టణంలో సంచలనం సృష్టించిన ఆత్మహత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటనలో భార్యే ప్రధాన నిందితురాలిగా పోలీసులు నిర్ధారించారు.
వెంగళరావు కాలనీలో నివాసం ఉంటున్న ధరవత్ హరినాద్ (39) ఇటీవల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తొలుత కేసు నమోదు కాగా, పోలీసులు చేపట్టిన లోతైన దర్యాప్తులో ఇది పక్కా హత్యగా తేలింది. మద్యం మత్తులో నిద్రిస్తున్న హరినాద్‌పై భార్యతో పాటు ఆమె ప్రియుడు, స్నేహితులు కలిసి దాడి చేసి గొంతు నులిమి హతమార్చినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో మృతుడి భార్య ధరవత్ శ్రుతిలయ ప్రధాన నిందితురాలిగా గుర్తించారు. ఆమె అటవీ శాఖలో బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తుండటం గమనార్హం. శ్రుతిలయకు కొండా కౌషిక్‌తో అక్రమ సంబంధం ఉండగా, హత్యకు కౌషిక్‌తో పాటు మోహన్, భాను సహకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
మొత్తం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన పాల్వంచ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది.









