ప్రతి క్షణం
ప్రజల పక్షం

  తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ఇస్తున్న కౌజు పిట్టలు, నాటు కోళ్ల పెంపకం

తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ఇస్తున్న కౌజు పిట్టలు, నాటు కోళ్ల పెంపకం
– జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన లక్కీ పౌల్ట్రీ ఫార్మ్ ను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతు నాయుడు ప్రసాద్ దంపతులు నిర్వహిస్తున్న కౌజు పిట్టలు, నాటు కోళ్ల పెంపకం యూనిట్లతో పాటు ఇంక్యులేటర్ (గుడ్ల నుంచి పిల్లల ఉత్పత్తి) వ్యవస్థను ఆయన సమగ్రంగా పరిశీలించారు.

ఫార్మ్‌లో అనుసరిస్తున్న ఆధునిక పెంపక విధానాలు, మేత తయారీ, ఆరోగ్య సంరక్షణ, శుభ్రత ప్రమాణాలు, ఉత్పత్తి సామర్థ్యం, మార్కెటింగ్ విధానాలపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇంక్యులేటర్ ద్వారా గుడ్ల నుంచి పిల్లల ఉత్పత్తి ప్రక్రియ, ఉష్ణోగ్రత నియంత్రణ, తేమ స్థాయి, హ్యాచింగ్ శాతం వంటి అంశాలపై నిర్వాహకులతో చర్చించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ఈ పౌల్ట్రీ ఫార్మ్ ద్వారా నెలకు సుమారు 30 వేల కౌజు పిట్టల గుడ్లు, అలాగే వెయ్యి నాటు కోడి గుడ్ల ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. ఇంక్యులేటర్ సహాయంతో ఆరోగ్యకరమైన పిల్లలను ఉత్పత్తి చేసి మహిళా స్వయం సహాయక సంఘాలకు, చిన్న రైతులకు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే రంగంగా కౌజు పిట్టలు, నాటు కోళ్ల పెంపకం నిలుస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ యూనిట్‌ను మరింత విస్తరించి ఇంక్యులేటర్ సామర్థ్యాన్ని పెంచితే ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని సూచించారు.

అలాగే విద్యుత్ ఖర్చు తగ్గించేందుకు సోలార్ విద్యుత్ వినియోగం దిశగా చర్యలు తీసుకోవాలని, పౌల్ట్రీ రంగంలో ఈ యూనిట్ ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఇలాంటి నమూనా పౌల్ట్రీ యూనిట్లు మరిన్ని ఏర్పాటయ్యేలా రైతులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!