ఏజెన్సీలో ఆణిముత్యం – నేషనల్ స్థాయికి ఎంపికైన బాలకృష్ణ
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలం బట్టుపల్లి గ్రామానికి చెందిన తోలేం బాలకృష్ణ ST ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీసా క్రీడల్లో ప్రతిభ కనబరిచి నేషనల్ స్థాయికి ఎంపిక కావడం విశేషం. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన క్రీడాకారుడిగా బాలకృష్ణ సాధించిన ఈ ఘనత స్థానికంగా గర్వకారణంగా మారింది.
14-12-2025 తేదీన మోడల్ స్పోర్ట్స్ స్కూల్, కిన్నరసానిలో ఏర్పాటు చేసిన క్రీడా శిక్షణా శిబిరంలో బాలకృష్ణ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. గతంలో కూడా జాతీయ స్థాయి సీనియర్ కబడ్డీ పోటీలకు మూడు సార్లు లీగ్ దశలో పాల్గొని తన ప్రతిభను చాటుకున్నాడు.
ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ కబడ్డీపై ప్రత్యేక మక్కువతో నిరంతరం సాధన చేస్తూ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిల్లో ఆడి రాష్ట్రానికి, మండలానికి మంచి పేరు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. బాలకృష్ణ సాధించిన విజయంపై కరకగూడెం మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, “నాకు తగిన సహాయ సహకారాలు అందిస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే దృఢ సంకల్పంతో ఉన్నాను” అని తెలిపారు. తనకు సహకారం అందించిన ట్రైబల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్‌తో పాటు క్రీడాకారులకు సమన్వయం చేసిన క్యాంపు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలతో మీ ముందుకు వస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.









