ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లకు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సమీక్ష
భద్రాచలం, డిసెంబర్ 12 (ఆధాబ్ న్యూస్):
ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులకు పూర్తి సమాచారాన్ని చేరువ చేయడానికి గోడపత్రికలను ఆవిష్కరించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ఈనెల 29 మరియు 30 తేదీల్లో జరగనున్న ముక్కోటి ఏకాదశి, తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం వంటి కార్యక్రమాలకు భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లను చేపట్టినట్లు చెప్పారు.
శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ— భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించిన గోడపత్రికలను ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అంటించడం జరుగుతుందని అన్నారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే నేపథ్యంలో వారికి అవసరమైన సదుపాయాల వివరాలు సులభంగా అర్థమయ్యేలా పత్రికలు రూపొందించినట్లు వెల్లడించారు.
అలాగే భక్తులకు కల్పించవలసిన వసతి సౌకర్యాలపై డిసెంబర్ 15న మధ్యాహ్నం 3:30 గంటలకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజనల్ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు వసతి ఏర్పాట్లపై పూర్తి నివేదికలతో సంబంధిత డివిజన్ అధికారులు హాజరు కావాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో దామోదర్ రావు, అర్చక స్వాములు మరియు సిబ్బంది పాల్గొన్నారు.









