ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అభివృద్ధితో తెలంగాణ అగ్రగామి ..
-సీతారామ ఎత్తిపోతల పథకం పెండింగ్ పనులు పూర్తి చేస్తాం
– మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్: ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఎదుగుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జిల్లా ఇంచార్జి మంత్రి వర్యులు వాకాటి శ్రీహరి, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు, రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపిలు బలరాం నాయక్, రామ సహాయం రఘురాం రెడ్డిలతో కలిసి పర్యటించారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి కి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పి బి రోహిత్ రాజులు ఘన స్వాగతం పలికారు. కొత్తగూడెంలో నెలకొల్పిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల మద్దతుకు ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వం రెండు సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు మీద కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. గతంలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కోసం వందల ఎకరాల భూమి రైతులు ఇస్తే స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతాల వారికి ఉపాధి లభించడంతో మొట్టమొదటిసారి తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడింది పాల్వంచ ప్రాంతంలోనని, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ఈ ప్రాంతం అందించిందని అన్నారు. 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు ఈ విశ్వ విద్యాలయానికి పెట్టుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.
భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశం అభివృద్ధి చెందడానికి ఎడ్యుకేషన్, ఇరిగేషన్ పాలసీ అమలు చేశారని, ప్రస్తుతం దేశంలో ఉన్న గొప్ప విశ్వ విద్యాలయాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆనాటి ప్రధానమంత్రినెహ్రూ ప్రారంభించినవి అని అన్నారు. బాక్రానంగల్ నుంచి నాగార్జునసాగర్ వరకు, శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు నీటి పారుదల ప్రాజెక్టులను జవహర్ లాల్ నెహ్రూ నిర్మించారని తెలిపారు. దేశం మొదటి ప్రధాని స్ఫూర్తితో ఎడ్యుకేషన్, ఇరిగేషన్ తెలంగాణను దేశ పటం మీద మొదటి స్థానంలో నిలుపుతుందని తమ ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుందని అన్నారు.భద్రాద్రి కొత్తగూడెం — అపారమైన అభివృద్ధికి శ్రీకారం
ఖమ్మం జిల్లాలో ఉన్న అపారమైన ఖనిజ సంపదను వెలికితీసి విశ్వమంతా గుర్తించేలా పరిశోధనలు జరగాలని లక్ష్యంగా ప్రభుత్వం ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని భద్రాద్రి కొత్తగూడెంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు విద్య, సాగు, నీటి వనరులు, పరిశ్రమల పరంగా కొత్త దిశగా అభివృద్ధి అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఖమ్మం జిల్లాకు విద్యా వెలుగులు
కొత్తగూడెంకు వైద్య కళాశాల, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు నిర్మాణం వంటి గొప్ప విద్యాసంస్థలు ఏర్పాటు చేసి ఖమ్మం జిల్లాను విద్యా కేంద్రంగా అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారు. భద్రాద్రి శ్రీ రామచంద్రుని సాక్షిగా ఈ ప్రాంతాభివృద్ధి బాధ్యతను స్వయంగా తీసుకుంటున్నానని పేర్కొన్నారు.
గోదావరి – కృష్ణ జలాల తోడు
గోదావరి, కృష్ణా నదుల జలాలను ఖమ్మం జిల్లాకు అందించే దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి తెలిపారు.
సీతారామ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిస్థాయిలో పూర్తి చేయడంతో పాటు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులను సమయానికి ముగిస్తామని భరోసా ఇచ్చారు.
ప్రజా సంక్షేమ పథకాల జన్మస్థలం — ఖమ్మం
రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ చీరలు వంటి అనేక పథకాలను ఖమ్మం జిల్లాలోనే మొదటగా ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేసిన సీఎం, ప్రజలు ఆశీర్వదించినందువల్ల రెండు సంవత్సరాల్లో ప్రజలు కనిపించేలా పాలన అందించగలిగామని అన్నారు.
గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రలోభాలకు లోనవకుండా మంచి అభ్యర్థులను ఎన్నుకోమని పిలుపునిచ్చారు.
టెలంగాణ విజయోత్సవాలకు భారీ ఏర్పాట్లు
డిసెంబర్ 8, 9 తేదీల్లో జరుగనున్న తెలంగాణ విజయోత్సవాలు మరియు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే తదితర జాతీయ నాయకులను ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లు చెప్పారు.
కొత్తగూడెం ప్రజల ప్రేమపూర్వక స్వాగతం తనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.
మంత్రి వర్గం అభిప్రాయాలు
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
దేశంలో ఎక్కడా లేని విధంగా భూమి, ఖనిజాలపై ప్రత్యేక పరిశోధనలు చేసే ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. ఈ విశ్వవిద్యాలయం ప్రపంచానికి జ్ఞానాన్ని అందించే కేంద్రంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరిట ఈ వినూత్న విశ్వవిద్యాలయం ఖమ్మం జిల్లాకు కేటాయించడం పట్ల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లాకు గోదావరి జలాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం రావాలని డిమాండ్ చేస్తూ, సీతారామ ఎత్తిపోతల పథకం కోసం అదనపు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
కొత్తగూడెంకు విమానాశ్రయం ఏర్పాటు కావాలని కోరారు.
రెవెన్యూ–హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రాష్ట్ర ఏర్పాటు వేళ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం ప్రత్యేకమన్నారు. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీను నెరవేర్చుతున్నామని చెప్పారు.
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
ఎర్త్ యూనివర్సిటీని ఈ ప్రాంతానికి కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
సీతారామ ఎత్తిపోతల పనులు వేగంగా సాగుతున్నాయని, 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ కోసం కేబినెట్ ఆమోదం లభించినట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో పాల్గొన్నారు
అదనపు కలెక్టర్లు విద్యా చందన, వేణుగోపాల్, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, మట్టా రాగమయి, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు, ఆర్డీఓ మధు, ప్రిన్సిపాల్ జగన్మోహన్ రాజు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, మహిళా సంఘాలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.









