కరకగూడెం గ్రామంలో విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ
అక్షరమే ఆయుధం – జ్ఞానమే శక్తి : డాక్టర్ షేక్ మస్తాన్ హుస్సేన్
కరకగూడెం ,ఆధాబ్ న్యూస్:
విద్య అనేది కేవలం అక్షరాలు నేర్పే పాఠ్యాంశం మాత్రమే కాకుండా, సమాజంలోని చీకట్లను తొలగించి వెలుగులు నింపే శక్తివంతమైన ఆయుధమని డాక్టర్ షేక్ మస్తాన్ హుస్సేన్ పేర్కొన్నారు. ‘ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్’ ఆధ్వర్యంలో, కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా సమన్వయంతో పడిగాపురం గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన విద్యాసామగ్రి పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ మస్తాన్ హుస్సేన్ మాట్లాడుతూ, పిల్లలు నేటి విద్యార్థులే కాదు, రేపటి పౌరులని, వారి భవిష్యత్ నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషించాలన్నారు. కేవలం చదువుకే పరిమితం కాకుండా, విద్యార్థుల్లో నైతిక విలువలు, సామాజిక బాధ్యత పెంపొందించేలా విద్య ఉండాలని సూచించారు.
ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా మానసిక—శారీరక ఆరోగ్య పరిరక్షణలో ప్రాణిక్ హీలింగ్ సేవలు, సమాజానికి ఎంతో ఉపయోగకరమని ఆయన అభినందించారు.
కార్యక్రమంలో భాగంగా సుమారు 50 మంది విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగ్స్, స్టేషనరీ పంపిణీ చేశారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలకు ఇది పెద్ద సహాయమవుతుందని డాక్టర్ హుస్సేన్ పేర్కొన్నారు.
తరువాత మాట్లాడిన ఫౌండేషన్ సభ్యులు సోందుపాషా మాట్లాడుతూ, రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టి గ్రామీణ విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు షేక్ వసీం అక్రం, గ్రామస్థులు స్వామి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.









