ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అటవీ బీట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి : ఆదివాసీ జేఏసీ అధ్యక్షుడు పోలేబోయిన వెంకటనారాయణ

అటవీ బీట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి : ఆదివాసీ జేఏసీ అధ్యక్షుడు పోలేబోయిన వెంకటనారాయణ

కరకగూడెం,ఆధాబ్ న్యూస్: ఏడుళ్లబయ్యారం రేంజ్ పరిధిలో లంబాడి ఫారెస్ట్ అధికారులు గిరిజన ఆదివాసులపై కక్షపూరితంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలపై చర్యలు తీసుకోవాలంటూ కరకగూడెం మండల ఆదివాసీ జేఏసీ నేతలు భద్రాద్రి జిల్లా డిఎఫ్ఓను మణుగూరులో కలిసి వినతిపత్రం అందజేశారు.

జేఏసీ అధ్యక్షుడు పోలేబోయిన వెంకటనారాయణ మాట్లాడుతూ—మండలంలో గిరిజనేతరులు మరియు లంబాడీలు కొత్తగా చెట్లు నరికి భూములు ఆక్రమిస్తున్నా, లేదా ఫారెస్ట్ ట్రెంచ్ భూముల్లో సాగు చేస్తున్నా, అటవీ అధికారులు వారి జోలికి వెళ్లడం లేదని అన్నారు. అయితే కోతుల కారణంగా పంట నాశనం అవుతుండటంతో ఒక చెట్టు నరికిన ఆదివాసిని రేంజ్ అధికారి సమక్షంలో కాకుండా, కొందరు ఫారెస్ట్ లంబాడా సిబ్బంది స్వేచ్ఛగా రేంజ్ ఆఫీసుకు తీసుకెళ్లడం సరైంది కాదని విమర్శించారు.

అదేవిధంగా — గిరిజనేతరులు సాగుచేస్తున్న భూముల్లో ఎఫ్‌సీసీ పాయింట్లు కనిపించనప్పటికీ, కేవలం ఆదివాసులు చేసిన సాగు భూములలో మాత్రమే ఎఫ్‌సీసీ పాయింట్లు గుర్తించడం పాక్షిక ధోరణి అని ఆరోపించారు. వాహనాలు వెళ్లగలిగే ప్రాంతాలకే అధికారులు చేరుకుని పరిశీలనలు చేస్తుండటం, మార్గం లేని ప్రాంతాలను పూర్తిగా విస్మరించడం తీవ్రమైన లోపమని పేర్కొన్నారు.

ఫారెస్ట్ అధికారులెవరైనా సరే సమాన్యాయంతో, కులవివక్ష లేకుండా విధులు నిర్వర్తించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆదివాసీలపై కక్షపూరిత వైఖరి కొనసాగితే, ఆదివాసీ జేఏసీ తప్పకుండా ప్రశ్నించడమే కాదు, తగిన చర్యలు కూడా తీసుకుంటుందని హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!