ప్రతి క్షణం
ప్రజల పక్షం

  సినిమా పైరసీపై సైబర్ పోలీసుల భారీ ఆపరేషన్‌ ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ – 21 వేల సినిమాలు అప్‌లోడ్, ₹20 కోట్లు అక్రమంగా సంపాదన

సినిమా పైరసీపై సైబర్ పోలీసుల భారీ ఆపరేషన్‌
ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ – 21 వేల సినిమాలు అప్‌లోడ్, ₹20 కోట్లు అక్రమంగా సంపాదన

హైదరాబాద్‌,ఆధాబ్ న్యూస్ : సినీ పరిశ్రమను సంవత్సరాలుగా వేధిస్తున్న పైరసీ ముఠాలపై హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ దెబ్బ కొట్టారు. ఐబొమ్మ, బెప్పం వంటి ప్రముఖ పైరసీ వెబ్‌సైట్లను నడిపిస్తున్న ప్రధాన నిందితుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని నగర సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు.

హ్యాకింగ్‌లో దిట్ట – 110 డొమైన్లు కొనుగోలు
విశాఖపట్నం కు చెందిన ఇమ్మడి రవి అత్యంత ఉన్నత సాంకేతిక నైపుణ్యాలు కలిగిన వ్యక్తి అని దర్యాప్తులో బయటపడింది. ప్రపంచ స్థాయి సర్వర్లు, కఠిన భద్రత కలిగిన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను కూడా సులభంగా హ్యాక్ చేసి, కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లను హెచ్‌డీ క్వాలిటీలో డౌన్‌లోడ్ చేసేవాడని సీపీ తెలిపారు. పైరసీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు రవి 110 డొమైన్లను కొనుగోలు చేసినట్లు చెప్పారు.

కరేబియన్‌ దీవుల్లో సర్వర్లు – 21,000 సినిమాల అప్‌లోడ్
హ్యాక్ చేసిన కంటెంట్‌ను కరేబియన్‌ దీవుల్లోని సర్వర్లలో నిక్షిప్తం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా వీక్షించేలా చేశాడు. 2019లో ప్రారంభించిన ఐబొమ్మలో ఇప్పటివరకు 21 వేల సినిమాలు, పలు భాషల వెబ్‌సిరీస్‌లు అప్‌లోడ్ చేసినట్లు వెల్లడించారు.

50 లక్షల సబ్‌స్క్రైబర్ల డేటా అమ్ముడు
ఐబొమ్మ ప్లాట్‌ఫారమ్‌కు చెందిన 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల వ్యక్తిగత డేటాను రవి డార్క్‌సైట్లకు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. పైరసీతో పాటు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం ద్వారా కూడా రవి సమాజానికి భారీ నష్టం కలిగించాడని సీపీ తెలిపారు.

తప్పించుకోవడానికి సెయింట్‌ నేవీ పౌరసత్వం
పోలీసుల పర్యవేక్షణ పెరగడంతో రవి కరేబియన్‌ దేశం సెయింట్‌ నేవీ పౌరసత్వం పొందాడు. ఇండోనేషియా, స్విట్జర్లాండ్‌, నెదర్లాండ్స్‌ దేశాల్లో సర్వర్లు ఏర్పాటు చేసి పోలీసులకు చిక్కకుండా పన్నాగం పన్నాడు. అయినప్పటికీ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని ట్రాక్ చేసి అరెస్టు చేశారు.

సినీ ప్రముఖుల అభినందనలు – సీపీ సజ్జనార్‌కు ప్రశంసలు

ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత సినీ పరిశ్రమ మొత్తం సజ్జనార్ మరియు సైబర్ క్రైమ్ బృందాన్ని అభినందించింది.

చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్‌రాజు లు సీపీని ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

చిరంజీవి: “పైరసీపై పోరాటంలో ఇది గొప్ప విజయం. పరిశ్రమకు ఆధారం లక్షల కుటుంబాలు ఉన్నాయి.”

నాగార్జున: “ఉచితంగా సినిమా అనేది ట్రాప్‌. ప్రజల డేటా నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తోంది.”

రాజమౌళి: “పైరసీని చాలామంది చిన్న విషయం అనుకుంటారు కానీ దాని వెనుక పెద్ద నేర ముఠా ఉంటుంది.”

దిల్‌రాజు: “పోలీసులు తలచుకుంటే నేరగాళ్లు ఎక్కడున్నా పట్టుకుంటారని నిరూపించారు.”

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియా ద్వారా తెలంగాణ పోలీసులకు అభినందనలు తెలిపారు. పైరసీ ముఠాల వల్ల పరిశ్రమ తీవ్ర నష్టం చవిచూస్తోందని, ఐబొమ్మ, బెప్పం మూసివేయడం ముఖ్యమైన అడుగని పేర్కొన్నారు.
ఉచిత పైరసీ వెబ్‌సైట్లు ప్రమాదకరం” – సీపీ సజ్జనార్ హెచ్చరిక

ప్రజలు పైరసీ వెబ్‌సైట్లను ఉపయోగించవద్దని సీపీ సజ్జనార్ ఘాటుగా హెచ్చరించారు.
సైబర్ నేరగాళ్లు ఏపీకే ఫైల్స్ ద్వారా పౌరుల డేటా దొంగిలిస్తున్నారని, పైరసీ ద్వారా దేశవ్యాప్తంగా వేల కోట్లు నష్టం జరుగుతోందని తెలిపారు.

ప్రజలు, సినీ పరిశ్రమ, పోలీసులు కలిసి పని చేస్తే పైరసీని పూర్తిగా అరికట్టగలమని సజ్జనార్ అన్నారు.

ఐబొమ్మ కేసు భారతీయ సినీ చరిత్రలో అతిపెద్ద పైరసీ ఆపరేషన్‌లలో ఒకటిగా నిలిచింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!