గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్: రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పం, గతంలో ఆమోదించిన బిల్లులు, గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలు, హైకోర్టు స్టే, సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ తిరస్కరణ వంటి పరిణామాలపై సమగ్రంగా చర్చ జరిగింది.
ఎన్నికలు నిర్వహించని పక్షంలో 15వ ఆర్థిక సంఘం నుంచి రావలసిన దాదాపు ₹3,000 కోట్ల నిధులు నిలిచిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో, కోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకుని ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.
సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ— బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను గుర్తుచేశారు. ఈ విషయంపై న్యాయస్థానాల్లో పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు.
కేబినెట్ ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి, కోర్టు తీర్పు వచ్చిన తరువాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు చేపట్టాలని నిర్ణయించింది. అలాగే, బీసీలకు పార్టీ తరఫున 42 శాతం టికెట్లు కేటాయించాలని కేబినెట్ భావించింది.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 8, 9 తేదీల్లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ ను ఫోర్త్ సిటీలో నిర్వహించాలని, డిసెంబర్ 9న ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్’ ను ఆవిష్కరించాలని నిర్ణయించారు.
ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీ సేవలను స్మరిస్తూ కేబినెట్ సంతాపం తెలిపింది. ఆయన రచించిన ‘జయ జయ హే తెలంగాణ’ రాష్ట్ర గీతాన్ని పాఠ్య పుస్తకాల మొదటి పేజీలో ప్రచురించాలని నిర్ణయించింది. అదేవిధంగా అందెశ్రీ కుమారుడు దత్తసాయికి డిగ్రీ కాలేజీ లెక్చరర్ ఉద్యోగం ఇవ్వాలని, ఆయన అంత్యక్రియల స్థలాన్ని స్మృతివనంగా అభివృద్ధి చేయాలని తీర్మానించింది.
గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రూపొందించిన బిల్లుకు మంత్రిమండలి ఆమోదం తెలిపినట్టు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈ బిల్లును రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టబద్ధం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
అదేవిధంగా, ప్రజల అభ్యర్థన మేరకు SRSP మెయిన్ కెనాల్‌కు రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరును పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.









