భూసమస్యల పరిష్కారం కోసం డివిజన్ వారీగా ప్రజావాణి: కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశాలు
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూసమస్యల పరిష్కారం కోసం ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి ప్రజావాణి కార్యక్రమానికి రావడం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, డివిజన్ వారీగా ప్రజావాణి నిర్వహించేలా చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.
కలెక్టర్ జారీ చేసిన సూచనల ప్రకారం—
భద్రాచలం డివిజన్ పరిధిలోని భూసమస్యలతో ఉన్న ప్రజలు ఇకపై భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజావాణిలో పాల్గొనవచ్చు. సబ్ కలెక్టర్ స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను పరిశీలిస్తారు.
అటు కొత్తగూడెం డివిజన్ పరిధిలోని ప్రజలు తమ భూసమస్యల పరిష్కారానికి కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించే ఆర్డీవో ప్రజావాణిలో హాజరవ్వాలని సూచించారు.
భూసమస్యలు కాకుండా ఇతర సమస్యలపై దరఖాస్తులు సమర్పించేవారు జిల్లా కలెక్టరేట్లోని ఇన్వార్డ్ సెక్షన్లో తమ దరఖాస్తులను అందజేసి రసీదు పొందాలని కలెక్టర్ తెలిపారు. అందిన అన్ని దరఖాస్తులపై వేగవంతంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.









