ప్రతి క్షణం
ప్రజల పక్షం

  జిల్లాలో సోలార్ విద్యుత్ విస్తరణకు చర్యలు వేగవంతం చేయాలి – టీజీ రెడ్‌కో ఛైర్మన్ ఎ. శరత్

జిల్లాలో సోలార్ విద్యుత్ విస్తరణకు చర్యలు వేగవంతం చేయాలి – టీజీ రెడ్‌కో ఛైర్మన్ ఎ. శరత్

భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
జిల్లాలో సోలార్ విద్యుత్ వినియోగాన్ని విస్తృతంగా పెంచేందుకు చర్యలను వేగవంతం చేయాలని టీజీ రెడ్‌కో ఛైర్మన్ ఎ. శరత్ ఆదేశించారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్‌తో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతూ కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వ్యవసాయ పంపులు వంటి కీలక ప్రదేశాల్లో సౌర విద్యుత్ వినియోగాన్ని పెంపొందించాలని సూచించారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతో విద్యుత్ ఖర్చులు తగ్గడమే కాక, పర్యావరణ పరిరక్షణకు ఇది ఎంతో తోడ్పడుతుందని ఆయన తెలిపారు.

ఛైర్మన్ ఎ. శరత్ మాట్లాడుతూ, పీఎం కుసుమ్ పథకం కింద అమలవుతున్న సౌర ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేయాలని వెల్లడించారు. సౌర శక్తి వినియోగంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయాలు మెరుగుపడుతాయని, రైతులకు దీర్ఘకాలిక లాభాలు కలుగుతాయని పేర్కొన్నారు.

అదే విధంగా ఇందిరా సౌర గిరి జలవికాసం పథకం కింద బోర్లు ఏర్పాటు చేయాల్సిన ప్రదేశాలను శాస్త్రీయంగా గుర్తించాలని ఆయన సూచించారు. భూగర్భ జలాల లభ్యత, భూసర్వే నివేదికలు, రైతుల సాగు అవసరాలను పరిగణలోకి తీసుకొని సాంకేతిక నిపుణుల సూచనలతోనే బోర్లు వేయాలని ఆదేశించారు.

జిల్లాలో మహిళా సంఘాల ద్వారా రెండు మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల స్థాపనకు సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లి, మణుగూరు మండలం ఉడతనేని గుంపుల్లో స్థలాలు కేటాయించబడ్డాయని ఆయన తెలిపారు. వీటి నిర్మాణానికి సంబంధించిన పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా మోడల్ సోలార్ గ్రామాల అభివృద్ధి కోసం గుర్తించిన 80 గ్రామాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గండుగులపల్లి కూడా ఒకటని, ఆ గ్రామాన్ని ఆదర్శ సోలార్ గ్రామంగా మార్చేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.

అదేవిధంగా ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గడమే కాక, అవి పర్యావరణ అనుకూల నమూనాలుగా నిలుస్తాయని శరత్ పేర్కొన్నారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ‘పీఎం సూర్య ఘర్’ పథకం కింద సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని కూడా ఆయన అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ విద్యా చందన, విద్యుత్ శాఖ అధికారి మహేందర్, టీజీ రెడ్‌కో జిల్లా మేనేజర్ రాజేందర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!