బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నవంబర్ 17 నుంచి భారీ వర్షాల హెచ్చరిక
హైద్రాబాద్,ఆధాబ్ న్యూస్:
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 17వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశంుందని, దాని ప్రభావంతో తదుపరి రెండు నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో ఆదిలాబాద్, కామారెడ్డి, వరంగల్, సిద్ధిపేట, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాలు, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షాల సమయంలో అతి కీలక ప్రయాణాలను తగ్గించాలని, నీటిమునిగిన ప్రాంతాల్లోకి వెళ్లకూడదని అధికారులు సూచించారు.









